ఇలా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది !

జీవితం అందంగా ... ఆనందంగా సాగిపోవాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలను పొందాలంటే, అనునిత్యం ఆమెను పూజిస్తూ వుండాలి. అంకితభావంతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే, సౌభాగ్యాన్ని ... సంపదలను ప్రసాదిస్తూ వుంటుంది. అందుకే స్త్రీలు అమ్మవారి పూజకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటారు. భక్తి శ్రద్ధలతో ఆమెను కొలుస్తూ, సంతృప్తికరమైన జీవితాన్ని అందించమని కోరుతుంటారు.

లక్ష్మీదేవికి సంబంధించిన ఏ విశేషమైన తిథిని మహిళా భక్తులు వదులుకోరు. ఆ రోజున వీళ్లు మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి అమ్మవారి సేవలో పూర్తిగా నిమగ్నమవుతుంటారు. అలా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే విశేషమైన వ్రతాలలో 'మహాలక్ష్మీ వ్రతం' ఒకటిగా చెప్పుకోవచ్చు.

'ఆషాఢ శుద్ధ దశమి' రోజున ఈ వ్రతాన్ని ఆరభిస్తూ వుంటారు. కొంతమంది మొదటి రోజున మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తే, మరికొందరు నెలరోజుల పాటు ఆచరిస్తుంటారు. సాధారణంగా నోములు ... వ్రతాలు నియమాల తోరణంలా కనిపిస్తుంటాయి. ఇక ఈ వ్రతం విషయానికి వచ్చేసరికి, ఈ నెలరోజుల పాటు ఆకు కూరలు వాడకూడదనే నియమాన్ని మహిళలు పాటిస్తుంటారు.

ఈ వ్రతాన్ని చేపట్టినవాళ్లు పూజా మందిరంలో అమ్మవారి ప్రతిమనుగానీ, చిత్రపటాన్నిగాని ఏర్పాటు చేసుకుంటారు. అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి షోడశ ఉపచారాలతో సేవిస్తారు. ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ .. దానిని ప్రసాదంగా స్వీకరిస్తూ వుంటారు. అనుదినం అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను ... గ్రంధాలను చదువుతూ మనసును ఆమెకి అంకితం చేస్తుంటారు ... ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలను సంతోషంగా పొందుతుంటారు.


More Bhakti News