భక్తులను భగవంతుడే రక్షిస్తాడు

ఆదికేశవుడు ఆవిర్భవించిన అనేక క్షేత్రాలను దర్శిస్తూ, ఆ స్వామి లీలా విశేషాలను గుండెల నిండా దాచుకుని తన ఊరికి చేరుకుంటాడు కనకదాసు. అంతటి మహాభక్తుడు తిరిగి తమ గ్రామంలో అడుగుపెట్టడమే అదృష్టంగా అక్కడి వాళ్లు భావిస్తారు. గతంలో ఆయనకి మనసిచ్చిన లచ్చి, పరుగు పరుగున వచ్చి కలుసుకుంటుంది. తనని పెళ్లాడవలసిందిగా కోరుతుంది.

ఆమె అభ్యర్థనని కనకదాసు సున్నితంగా తిరస్కరిస్తాడు. తన మనసులో భగవంతుడికి తప్ప మరెవరికీ స్థానం లేదని చెబుతాడు. మోక్షాన్ని సాధించడానికి శరీరమే సాధనమని అంటాడు. దాంతో ఆమె కూడా ఆదికేశవుడి సేవలో తన జీవితాన్ని తరింపజేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అయితే లచ్చి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తండ్రి మల్లన్న తప్పుబడతాడు.

ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారకుడు కనకదాసేనని భావిస్తాడు. కనకదాసును అంతం చేస్తేనే తప్ప, తన సమస్యకి పరిష్కారం లభించదని అనుకుంటాడు. ఆగ్రహావేశాలతో కనకదాసు దగ్గరికి వెళతాడు ... తన కూతురిని తనకి కాకుండా చేసిన అతణ్ణి అంతం చేయడనికి వచ్చినట్టు చెబుతాడు. ఆ విధంగా భగవంతుడు తనకి మోక్షాన్ని ప్రసాదిస్తానంటే, అందుకు తాను సిద్ధంగా వున్నానని చెబుతాడు కనకదాసు.

గొడ్డలితో ఒక్కసారిగా ఆయనపై విరుచుకు పడతాడు మల్లన్న. అయితే ఎంతగా ప్రయత్నించినా తన చేతిలోని గొడ్డలి కనకదాసును తాకకపోవడం మల్లన్నకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతనిలో గల అజ్ఞానం .. అహంకారం తెరలుతెరలుగా తొలగిపోతాయి. ఆయన గొప్పతనాన్ని అర్థంచేసుకోలేక అవమానకరంగా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపపడతాడు. పెద్ద మనసుతో తనని మన్నించమంటూ ఆయన పాదాలపై పడతాడు. అందరినీ అనుగ్రహించ వలసినదీ, ఆదరించవలసినది ఆ ఆదికేశవుడేననీ, ఆయన పాదాలను ఆశ్రయించమని సూచిస్తాడు కనకదాసు.


More Bhakti News