అలా స్వామి ప్రత్యక్ష దర్శనమిచ్చాడు !

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడిగా అందరికీ తెలిసిన 'కురువ నంబి' పూర్వనామం భీముడు. ఆయన కుండలను తయారుచేస్తూ ... అవి అమ్మేయగా వచ్చిన సొమ్ముతో జీవనాన్ని కొనసాగించేవాడు. కుండల తయారీకి మట్టిని తీసుకురావడం ... కుండలను తయారు చేయడం ... వాటిని సంతలో అమ్ముకురావడం తప్ప ఆయనకి మరేమీ తెలియదు.

అయితే ఏ పని చేస్తున్నా తిరుమల శ్రీనివాసుడిని మనసునందు నిలుపుకునేవాడు. ఆ స్వామి రూపాన్ని ఊహించుకుంటూ .. ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉండేవాడు. కుండల తయారీలో భాగంగా మట్టితొక్కుతూ, చిన్న చిన్న మట్టి ముద్దలనే పువ్వులుగా భావించి ... మనసు మందిరంలో గల స్వామివారి పాదాల చెంత వాటిని సమర్పించేవాడు. అసమానమైన ఆయన భక్తిని చూసి శ్రీనివాసుడు మురిసిపోయేవాడు. ఆ మట్టి పువ్వుల్లో గల భక్తి పరిమళాలను ఆనందంగా ఆస్వాదించేవాడు.

అలా శరీరం సహకరిస్తున్నంత కాలం భీముడు .. స్వామివారిని స్మరిస్తూ తరించాడు. వయసు పైబడటంతో భీముడు అవసాన దశకు చేరుకుంటాడు. ఆయన తుది శ్వాసకు సమయం ఆసన్నమైందని గ్రహించిన వేంకటేశ్వరస్వామి, ఎలాంటి ఆభరణములు లేకుండా ఆయనకి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇందుకు నిదర్శనంగానే కురువనంబి నివసించిన గ్రామం ( తిరుక్కురువై ) లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది.

ఈ ఆలయంలో ఆభరణాలు లేకుండా వేంకటేశ్వరస్వామి కొలువై వుండగా, ఆయన సన్నిధిలో కురువ నంబి దర్శనమిస్తూ వుంటాడు. రామానుజాచార్యుల వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది. అలా భగవంతుడి సన్నిధిలోను ... ఆయన మనసులోనూ స్థానాన్ని సంపాదించుకున్న ధన్యజీవిగా కురువనంబి కనిపిస్తుంటాడు. భగవంతుడిని చేరుకునే మార్గాన్ని భక్తులకు సూచిస్తున్నట్టుగా అనిపిస్తుంటాడు.


More Bhakti News