దర్శన మాత్రం చేతనే ధన్యులను చేసే క్షేత్రం

శ్రీమహా విష్ణువు తన భక్తులను అనుగ్రహించడం కోసం భూలోకంలోని అనేక ప్రాంతాలలో ఆవిర్భవించాడు. అలా ఆయన కొలువుదీరిన పవిత్ర ప్రదేశాలు వైష్ణవ దివ్య క్షేత్రాలుగా అలరారుతున్నాయి. ఒక్కో క్షేత్రంలో స్వామివారు ఆవిర్భవించిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తూ, ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూ వుంటుంది. ఒక్కో చోటున ఆయన ఒక్కో పేరుతో పిలవబడుతూ, కొండంత దేవుడుగా కొలవబడుతూ కోరిన వరాలను ప్రసాదిస్తూ వుంటాడు.

అలాంటి విశిష్ట క్షేత్రాల్లో ఒకటిగా 'నంద ప్రయాగ' (జోషీమఠ్) దర్శనమిస్తూ వుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అడుగడుగునా భక్తిభావ పరిమళాలను వెదజల్లే ఈ క్షేత్రం, దేవప్రయాగకి 170 కిలోమీటర్ల దూరంలో విలసిల్లుతోంది. 'కుబేరుడు' తపస్సు చేసినట్టుగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో, శేష శయనుడైన స్వామివారు 'పరమపురుషుడు' గాను ... అమ్మవారు పరిమళ వల్లి గాను పూజభిషేకాలు అందుకుంటూ వుంటారు.

హిమవంతుడికీ ... ఆయన కూతురైన పార్వతీదేవికి స్వామివారు ఇక్కడ ప్రత్యక్ష దర్శనం ఇచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఆ తరువాత ఎంతోమంది దేవతలు ... మహర్షులు స్వామివారిని సేవించి తరించారు. ఈ కారణంగానే ఆ సమ్మోహన స్వరూపుడిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. అలా స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆయన దివ్యమంగళ రూపాన్ని మనసులో దాచుకోకుండా అక్కడి నుంచి కదలలేరు.

ప్రశాంతతను ప్రసాదించే ఈ క్షేత్రంలో నృసింహస్వామి ... వాసుదేవస్వామి ఆలయాలు కూడా దర్శనమిస్తూ వుంటాయి. నృసింహ స్వామిని ఆదిశంకరులవారు ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. ఇన్ని విశేషాలను సొంతం చేసుకున్న ఈ నేలపై అడుగుపెట్టడమే అదృష్టంగా భావించే భక్తులు, ఇక్కడ విష్ణుగంగ ... మందాకిని నదులు కలుస్తూ వుండటం చూసి పరవశించిపోతారు. వీటి తీరంలో గల యశోదా కృష్ణుల ఆలయాన్ని దర్శించి తమని తాము మరిచిపోతారు. దర్శనమాత్రం చేతనే ఈ క్షేత్రం ధన్యులను చేస్తుందనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.


More Bhakti News