తదియ రోజున పొట్లకాయ తినకూడదా ?

సాధారణంగా చాలామంది ఇళ్లలో ఏ రోజున ఏ కూర చేయాలనే విషయంపై పెద్ద చర్చే జరుగుతూ వుంటుంది. ఎందుకంటే ఇష్టమైన కూర కంచంలో కనిపించకపోతే, భోజనం మానేసే వాళ్లు ఎక్కువమందే వుంటారు. ఇక మిగతా వాళ్లు ప్రసాదంలా కొంచమే పెట్టించుకుని, ఏదో కాస్త ఎంగిలి పడ్డామనిపించి వెళ్లిపోతుంటారు.

భోజనాల సమయంలో అక్కడి వాతావరణాన్ని మార్చే శక్తి కూరలకు వుంది గనుకనే, వడ్డించే స్థానంలో ఉండేవాళ్లు అందరికీ ఇష్టమైన కూరగాయాలనే తీసుకుంటూ చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న కూరల్లో కొన్నింటిని కొన్ని తిథుల్లో తినకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ నియమాన్ని పాటించకపోవడం వలన కొన్ని దోషాలు కలుగుతాయని స్పష్టం చేస్తున్నాయి.

నిజానికి ఫలానా రోజున ఫలానా కూర చేయాలని ఎవరూ నియమంగా పెట్టుకోరు. తమకి ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తుంటారు. ఇక తినే వాళ్లలో కూడా తిథుల గురించిన ఆలోచన రానే రాదు. అలాంటిది కొన్ని కూరలను కొన్ని తిథుల్లో తినకూడదని తెలిస్తే ఆశ్చర్యపోతుంటారు. ఈ నేపథ్యంలో తదియ రోజున 'పొట్లకాయ' తినకూడదనీ, ఒకవేళ తింటే శత్రువుల పోరు ఎక్కువ అవుతుందని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడుతోంది.

ఆర్ధిక పరమైన స్థితిపై ... ఆరోగ్యపరమైన స్థితిపై శత్రువులు దెబ్బకొడుతుంటారు. ఫలితంగా ఎదుగుదలకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అందువలన తదియ రోజున పొట్లకాయకు దూరంగా ఉండటమే అన్ని విధాలా మంచిదని చెప్పబడుతోంది.


More Bhakti News