గంగాజలం

పవిత్రమైన నదిగా మనం భావిస్తోన్న'గంగానది'దేవతల నదిగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహా విష్ణువు పాదాల చెంత జన్మించిన ఈ గంగ, భగీరథుని ప్రయత్నం కారణంగా పరమశివుడు జటాజూటానికి చేరి అక్కడి నుంచి నేలపైకి జాలువారింది. శివకేశవుల స్పర్శ కారణంగా పాపాలను కడిగివేయగల మహిమాన్వితమైన శక్తిని తన సొంతం చేసుకుంది.

ఎంతకాలం నిలవ ఉంచినా గంగా జలం చెడిపోదు ... దానిని సేవించిన వారిని వ్యాధుల బారిన పడనీయదు. దైవ సంబంధమైన అభిషేకాలకు ... శుద్ధికి గంగాజలాన్ని ఉపయోగిస్తూ ఉంటారంటే, అది ఎంతటి మహిమాన్వితమైనదో అర్థం చేసుకోవచ్చు. దివ్య క్షేత్రంగా చెప్పుకునే కాశీ ... గంగానది కారణంగా మరింత పుణ్య స్థలిగా అలరారుతోందని మహర్షులు ఎప్పుడో చెప్పారు.

గంగానది ఎన్నో వనమూలికలను స్పర్శిస్తూ ... మరెన్నో ప్రాంతాలను దాటుకుంటూ రావడం వలన సహజమైన ఔషధ గుణాలను అది అందిస్తుంటుంది. అందువల్లనే గంగానదీ జలాన్ని తీర్థంగా స్వీకరించడాన్ని మహా భాగ్యంగా భావిస్తుంటారు. ఇక గంగానదిలో స్నానమాచరించడం వలన సర్వ పాపాలు హరిస్తాయనే విశ్వాసం వేదకాలం నుంచి ఉన్నదే. చనిపోయిన వారికి పుణ్య లోకాలు ప్రాప్తించడం కోసం వారి అస్తికలను కూడా గంగానదిలో కలుపుతుంటారు. తరతరాలుగా మలినాలను తనలో జీర్ణించుకుంటూ ప్రశాంతంగా ప్రవహిస్తోన్న గంగానది, భారతదేశాన్ని పవిత్రం చేసింది ... భారతీయులను పునీతులను చేసిందని చెప్పక తప్పదు.


More Bhakti News