బాధలను తీర్చడంలో బాబా ప్రత్యేకత !

వివాహ సంబంధమైన ... ఉద్యోగ సంబంధమైన సమస్యలను బాబాకు చెప్పుకోవడానికి ఎంతోమంది శిరిడీ వచ్చేవాళ్లు. అలాగే ఆర్ధికపరమైన ... ఆరోగ్యపరమైన కష్టాలను బాబాకు విన్నవించడానికి కూడా అనేకమంది ఆయన మశీదుకి చేరుకునే వాళ్లు. ఆత్మీయంగా పలకరిస్తూ చిరునవ్వుతోనే బాబా వాళ్లకి కొన్ని సలహాలు ... సూచనలు చేసేవాడు.

ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతోన్న వాళ్లలో కొందరికి ఆయన చిట్కా వైద్యం చెప్పేవాడు. మరికొందరికి వ్యాధి నివారణ మార్గంగా ఆయన చెప్పే చికిత్సా విధానం, వాళ్లని ఆశ్చర్యానికి గురిచేసేది. ఎక్కడా ఎలాంటి మందుల ప్రస్తావన లేకుండా ఆయన చెప్పే సలహా వాళ్లకి చిత్రంగా అనిపించేది. అయితే బాబా దగ్గర ఆ సందేహాన్ని వ్యక్తంచేసే ధైర్యం లేకపోవడం వలన, మౌనంగానే అక్కడి నుంచి వెళ్లిపోయి ఆ సలహాను పాటిస్తూ వుండేవాళ్లు.

అలాంటి అనుభవమే ఒకసారి 'బాలాగణపతి షింపే'కి ఎదురవుతుంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన బాబాను కలుకుంటాడు. తన పరిస్థితిని బాబాకు వివరించి, తక్షణమే తనకి ఉపశమనం కలిగేలా చేయమని కోరతాడు. కంగారు పడవలసిన పనిలేదనీ ... పెరుగన్నం కలిపి నల్లకుక్కకు పెట్టమని చెబుతాడు బాబా. ఆ మాట బాలాగణపతికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

తన వ్యాధికీ ... నల్లకుక్కకి గల సంబంధమేమిటో ఆయనకి అర్థం కాలేదు. అయినా బాబాపట్ల గల విశ్వాసంతో ఆయన వెనుదిరుగుతాడు. ఇంటికి వెళ్లగానే పెరుగన్నం కలిపి, నల్లకుక్కకు పెడతాడు. అలా ఆయన కొన్నిరోజులు చేయగానే అనారోగ్యం పూర్తిగా తొలగిపోతుంది. తనని ఎంతో కాలంగా పీడిస్తూ వచ్చిన వ్యాధి రోజు రోజుకీ తగ్గుముఖం పడుతూ వచ్చి, పూర్తిగా అదృశ్యం కావడంతో బాలా గణపతి ఆనందంతో పొంగిపోతాడు.

పూర్వజన్మలో చేసిన పాపం ఫలితంగానే తనకి ఆ వ్యాధి వచ్చి ఉంటుందనీ, ఆ దోషాన్ని నివారించడం కోసమే బాబా అలా చెప్పాడని బాలాగణపతికి అర్థమవుతుంది. దాంతో ఆయన బాబాను కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన పాదాలకు నమస్కరిస్తాడు. ఆయనకి గల విశ్వాసమే ఆ వ్యాధికి విరుగుడులా పనిచేసిందంటూ బాబా ఆశీర్వదిస్తాడు.


More Bhakti News