పావన గోదావరీ తీరంలో పరమశివుడు

కాకతీయులు తమ పరిపాలనా కాలంలో సంగీత సాహిత్యాలకు ... శిల్పకళకు ... దేవాలయల నిర్మాణానికి ... యుద్ధ విజయాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా ఆధారాలు చెబుతుంటాయి. కాకతీయుల ఏలుబడిలో గల ప్రదేశాలను దర్శించినట్టయితే, శైవ ఆలయాల నిర్మాణానికి ... అంతకు ముందునుంచి వున్న ఆలయాల అభివృద్ధికి వాళ్లు ఎంతగా కృషి చేశారనేది అర్థమవుతుంది.

అలా కాకతీయుల శైవ భక్తికి నిదర్శనంగా నిలిచే క్షేత్రాల్లో 'వాటోలి' ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి శివుడు ... బ్రహ్మేశ్వరుడుగా పూజలు అందుకుంటూ వుంటాడు. విశిష్టమైన విశ్వేశ్వర క్షేత్రాల్లో ఒకటిగా కనిపిస్తోన్న ఈ ఆలయం, ఆదిలాబాది జిల్లా నిర్మల్ సమీపంలో అలరారుతోంది. గోదావరికి ఇరువైపులా గల అయిదు శివాలయాలలో ఒకటిగా ఈ బ్రహ్మేశ్వర ఆలయం దర్శనమిస్తుంది.

ఈ అయిదు ఆలయాలను కాకతీయులు నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతుంటాయి. కాకతీయుల అభిరుచికి తగినట్టుగా రూపొందించబడిన శివలింగాలు, తీర్చిదిద్దబడినటువంటి పానవట్టంతో అందంగా .. ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ఈ ఆలయాలలోని శివలింగాలపై వారి ముద్ర కనిపించదు కాబట్టి, ఇవి అంతకు పూర్వమే ప్రతిష్ఠించబడినవిగా చెబుతుంటారు.

కాకతీయుల శైవ భక్తికీ, ఆనాటి ఆధ్యాత్మిక వైభవాన్ని ఈ ఆలయం ఆవిష్కరిస్తూ వుంటుంది. ప్రశాంతమైన ఈ ప్రదేశంలో అడుగుపెట్టగానే ఇది పవిత్రమైన క్షేత్రమనే విషయం అర్థమైపోతుంది. ఎంతోమంది సిద్ధపురుషులు ఇక్కడి స్వామిని సేవించారని చరిత్ర చెబుతోన్న విషయాల్లో ఎంతమాత్రం అసత్యం లేదనిపిస్తుంది.

విశేషమైనటు వంటి పర్వదినాల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. స్వామివారి పూజాభిషేకాల్లో పాల్గొని ఆయన ఆశీస్సులు అందుకుంటూ వుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన తలపెట్టిన కార్యాలు సఫలీకృతమవుతాయనీ, విజయాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News