ఈ వినాయకుడు పెరుగుతున్నాడట !

కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన దైవాల ప్రతిమలు పెరుగుతూ ఉంటాయని చెబుతుంటారు. అందుకు ఆధారాలను కూడా చూపుతుంటారు. యాగంటి 'బసవన్న' విషయానికే వస్తే, ఒకప్పటికీ ఇప్పటికీ విగ్రహం యొక్క పరిమాణంలో చాలా మార్పు వచ్చిందని చెబుతుంటారు.

ఒకప్పుడు ఈ విగ్రహం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసే వాళ్లు. కానీ కాలక్రమంలో పరిమాణం పెరిగిపోయి ప్రదక్షిణల మార్గం మూసుకుపోతూ వచ్చింది. ఇక మరికొన్ని చోట్ల కూడా ఆయా దైవాల ప్రతిమలు పెరుగుతున్నాయని చెబుతుంటారు. చాలాకాలంగా వాడుతూ వస్తోన్న ఆభరణాలు విగ్రహాలకు సరిపోకపోవడమే అందుకు ఆధారమని అంటారు.

విశాఖ జిల్లా 'చోడవరం' గణపతి విషయంలోనూ ఇదే విశేషం కనిపిస్తూ వుంటుంది. రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సగభాగం వరకూ భూమిలో కూరుకుపోయిన స్వయంభువు గణపతి విగ్రహం బయటపడింది. ఈ ప్రతిమను అక్కడి నుంచి కదిలించడానికి స్థానికులు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో, అక్కడే ఆలయాన్ని నిర్మించడం జరిగింది.

ఆనాటి నుంచి ఈ విగ్రహం పెరుగుతోందనీ, అందువల్లనే అంతకుముందు నుంచి ఉపయోగిస్తూ వస్తోన్న కిరీటం, ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదని చెబుతుంటారు. మహిమాన్వితుడైన ఇక్కడి గణపతిని దర్శించడం వలన సకల శుభాలు చేకూరతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News