కృష్ణుడి గురుకులంలో నుంచున్న నంది !

సాధారణంగా ప్రతి గ్రామంలోను ఒక వైష్ణవ ఆలయం ... ఒక శివాలయం దర్శనమిస్తూ వుంటాయి. గ్రామస్తులు ఉదయం వేళలో వైష్ణవ ఆలయానికీ, సాయం సమయాల్లో శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుని వస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో ఏ శివాలయానికి వెళ్లినా ... ప్రసిద్ధి చెందినటువంటి ఏ శైవ క్షేత్రానికి వెళ్లినా అక్కడ గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు కూర్చుని దర్శనమిస్తూ వుంటాడు. స్వామి వారి ఎడబాటుని భరించలేనట్టుగా ఆయన వైపే చూస్తూ, ఆయన ఆదేశం కోసం కాచుకుని కూర్చున్నట్టుగా కనిపిస్తూ వుంటాడు.

అలాంటి నందీశ్వరుడు స్వామివారి గర్భాలయానికి ఎదురుగా కూర్చుని కాకుండా, నుంచుని కనిపిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి అరుదైన దృశ్యం 'ఉజ్జయిని'లో కనిపిస్తుంది. ఉజ్జయినిలో 'సాందీపని మహర్షి' ఆశ్రమం దర్శనమిస్తుంది. ఇక్కడే శ్రీకృష్ణుడు ... బలరాముడు ... సుధాముడు విద్యను అభ్యసించినట్టుగా చెబుతారు. ఈ ఆశ్రమలోనే ఓ శివాలయం దర్శనమిస్తూ వుంటుంది. ఈ ఆలయంలో గల శివుడికి ఎదురుగా నంది కూర్చుని కాకుండా నుంచుని కనిపిస్తూ వుంటాడు.

నందిని ఇలా చూడగానే చిత్రమైన అనుభూతి కలుగుతుంది. నందీశ్వరుడు ఇక్కడ నిలబడి ఉండటానికి గల కొన్ని ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. ఒకప్పటి సాందీపని మహర్షి ఆశ్రమంగా చెప్పబడుతోన్న ప్రదేశంలో ... శ్రీకృష్ణుడు నడయాడిన పుణ్యస్థలిలో అడుగుపెట్టడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి శివాలయంలోని నందీశ్వరుడు నిలబడి వుండటం ఆశ్చర్యచకితులను చేస్తుంది.


More Bhakti News