ఈ రోజుల్లో కుమారస్వామి అనుగ్రహిస్తాడు

అసుర సంహారంతో జరగవలసిన లోక కల్యాణం కోసం కుమారస్వామి ఆవిర్భవించాడు. ఆరు ముఖాలు ... పన్నెండు చేతులతో ఆయన ఆవిర్భవించడం జరిగింది. ఆరు ముఖాలు .. ఆరు రుతువులకు, పన్నెండు చేతులు .. పన్నెండు మాసాలకు ప్రతీక. అందువలన ఆయనను సంవత్సరాగ్ని స్వరూపంగా భక్తులు కొలుస్తుంటారు.

కుమారస్వామి 'శక్తి' ఆయుధాన్ని ధరించి కనిపిస్తుంటాడు. ఇచ్ఛాశక్తి ... జ్ఞానశక్తి ... క్రియాశక్తి అనే మూడు శక్తుల కలయికగా ఈ ఆయుధం చెప్పబడుతోంది. అద్వితీయమైన ఈ ఆయుధాన్ని ధరించిన కారణంగా కుమారస్వామిని జ్ఞాన స్వరూపుడిగా కూడా భక్తులు ఆరాధిస్తూ వుంటారు.

ఇక సుబ్రహ్మణ్యస్వామిగా ఆయన సర్పరూపంలో భక్తులకు చేరువైన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తుంటారు. స్కందుడు అనే పేరుతోను ప్రసిద్ధి చెందిన కుమారస్వామిని పూజించడం వలన, సకల దేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.

అలాంటి కుమారస్వామి ఆషాఢ మాసంలో రెండు రోజుల పాటు విశేషమైన రీతిలో పూజాభిషేకాలు జరుపుకుంటూ కనిపిస్తాడు. ఆషాఢ శుద్ధ పంచమి 'స్కంద పంచమి' గా ... ఆషాఢ శుద్ధ షష్ఠి 'స్కంద షష్ఠి' గా చెప్పబడుతోంది. ఈ రెండు రోజులు కుమారస్వామికి అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. అందువలన ఈ రోజుల్లో ఆయనని షోడశ ఉపచారాలతో పూజించాలని శాస్త్రం చెబుతోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనని ఆరాధించి, స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి.

ఈ రెండు రోజుల్లోనూ పూజ అనంతరం ఓ బ్రహ్మచారిని పిలిచి భోజనం పెట్టి వస్త్రదానం చేయాలి. దగ్గరలో గల కుమారస్వామి ఆలయాన్ని దర్శించి, ఆయనకి అభిషేకం చేయిస్తే మరీ మంచిది. ఈ విధంగా చేయడం వలన మనసులోని కోరికలు నెరవేరతాయనీ, స్వామి అనుగ్రహంతో అనంతమైన పుణ్య ఫలాలలు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News