శ్రీశైల క్షేత్ర మహిమ

విష్ణు భక్తులకు తిరుమల ఎంతటి పవిత్ర క్షేత్రమో ... శివ భక్తులకు 'శ్రీ శైలం' అంతటి పుణ్య క్షేత్రం. ఇక శివ కేశవులకు భేదం లేదని విశ్వసించేవారు ఈ రెండు క్షేత్రాలను రెండు కళ్ళుగా భావిస్తూ వుంటారు. పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ... అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోన్న శ్రీ శైలం, దర్శనం మాత్రం చేతనే ధన్యులను చేస్తుంది. చూడగానే పవిత్రతకు ప్రతీకగా ... ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపించే ఈ పుణ్య క్షేత్రం, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు జిల్లా నల్లమల అడవులలోని పర్వత శ్రేణుల మధ్యలో అలరారుతున్నది. శిలాదుడి కుమారుడైన పర్వతుని తపస్సు ఫలితంగా ఈ క్షేత్రం 'శ్రీ శైలం'గా మారగా, చంద్రగుప్త మౌర్యుడి కూతురు చంద్రావతి మల్లెపూలతో సేవించిన కారణంగా ఇక్కడి స్వామివారు మల్లికార్జున నామధేయంతో వర్ధిల్లుతున్నట్టు చారిత్రక నేపథ్యం చెబుతోంది.

ఇక ఈ సమస్త భూమండలానికి శ్రీ శైలం నాభిస్థానంలో వుందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే మనం పూజాది కార్యక్రమాల్లో శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే ... శ్రీ శైలస్య ఉత్తర దిగ్భాగే ... అంటూ శ్రీ శైలానికి మనం ఏ దిక్కున వున్నది సంకల్పం చెప్పుకుంటూ ఉంటాము. పరమపావన పుణ్య క్షేత్రమైన శ్రీ శైలానికి తూర్పు ద్వారంగా త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), పశ్చిమ ద్వారంగా అలంపురం (మహబూబ్ నగర్ జిల్లా ), ఉత్తర ద్వారంగా ఉమా మహేశ్వరం, దక్షణ ద్వారంగా సిద్ధవటం (కడప జిల్లా) చెప్పబడ్డాయి. 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే' అనేది ఆర్యోక్తి. కేవలం శిఖరాన్ని చూసినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించగల మహిమాన్వితమైనది ఈ దివ్య క్షేత్రం. బ్రహ్మగిరి ... విష్ణుగిరి ... రుద్రగిరి అనే పర్వత పంక్తిని తాకుతూ ... తరిస్తూ పాపాలను హరింపజేస్తూ ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తూ వుంటుంది. దక్షణ కైలాసంగా భావించే శ్రీ శైలక్షేత్ర గొప్పతనాన్ని గురించి18 పురాణాల్లోను ప్రస్తావించడం జరిగింది. .క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దంలోనే శ్రీ శైలం ఆధ్యాత్మిక వైభవాన్ని కలిగివుందనడానికి ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి.

విశ్వేశ్వరుడి విన్యాసాలకు కేంద్రంగా నిలిచిన ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన ఆది శంకరులవారు, కొంతకాలం పాటు ఇక్కడే ఉండిపోయి 'శివానందలహరి' ని రచించినట్టు చెబుతారు. శాతవాహనులు మొదలు ఇక్ష్వాకులు ... విష్ణు కుండినులు ... పల్లవులు ... కదంబులు ... చోళులు ... రాష్ట్ర కూటులు ... చాళుక్యులు .. హోయసాలులు ... కాకతీయులు ... రెడ్డిరాజులు ... విజయనగర ప్రభువుల పాలనలో వెలుగొందిన ఈ పుణ్య క్షేత్రం, మనసుకు హత్తుకునే చారిత్రక సంపదను తనలో మౌనంగా నిక్షిప్తం చేసుకుంది.

విరూపాక్షుని హృదయాన్ని ప్రతిబింబిస్తూ ప్రధాన ఆలయం విశాలంగా కనిపిస్తుంది. ముఖమంటపంలో కొలువుదీరిన రత్నగర్భ గణపతి ... నల్లరాతితో మలచబడిన సుదర్శన వీరభద్రుడు కనువిందు చేస్తారు. ప్రధాన ఆలయంతోపాటు ... ఉపాలయాలు కూడా ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లకు కడుతుంటాయి. వాటిలో వృద్ధ మల్లికార్జున స్వామి ... ఉమామహేశ్వర మూర్తి ... వీరభద్ర మూర్తి ... కుమార స్వామి ... రాజరాజేశ్వరీ దేవి ...పంచ శివాలయాలు ... నవబ్రహ్మ ఆలయాలు ... ఆస్థాన మండపం విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి.

శ్రీ శైలం ప్రసిద్ధమైన దివ్య క్షేత్రమే కాకుండా ... సహజ సిద్ధ క్షేత్రమనీ, ఇక్కడ మల్లికా కుండం ... మనోహరకుండం ... ఘంటా కుండం ... ఘంటికా కుండం ... వరాహ కుండం ... వృషభ కుండం ... బ్రహ్మ కుండం ... సూర్య కుండం ... చంద్ర కుండం మొదలైన దివ్య తీర్థాలతో ఈ క్షేత్రం అలరారుతున్నట్టుగా నాటి శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇక శివుడి ఫాలభాగం నుంచి పడుతున్న ధారగా 'ఫాలధార' ... శివుడి పంచ ముఖాల నుంచి జాలువారుతున్న ధారను 'పంచధార'గా ఈనాటికీ భక్తులు భావిస్తుంటారు. ఎవరెవరు శ్రీ శైలం వచ్చి వెళ్లారు అనే విషయాన్ని వివరించే సాక్షిగా ఇక్కడ 'సాక్షి గణపతి' కనిపిస్తాడు.

ఇక ఇక్కడి పాతాళ గంగలో స్నానం పాపాలను పటాపంచలు చేసి ... పుణ్య ఫలాలను పుష్కళంగా ప్రసాదిస్తుంది. కృత యుగంలో హిరణ్య కశ్యపుని పూజా మందిరంగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో ... త్రేతా యుగంలో సీతారాములు ... ద్వాపర యుగంలో పాండవులు శివలింగాలను ప్రతిష్టించినట్టు తెలుస్తోంది. నేటికీ ఈ శివలింగాలు భక్తులతో విశేష పూజలు అందుకుంటూ ఉన్నాయి. కాశీలో కొన్ని సంవత్సరాల పాటు వుండటం వల్ల కలిగే పుణ్య ఫలాలు ... శ్రీ శైల క్షేత్రాన్ని ఒకసారి దర్శించడం వల్లనే కలుగుతాయని స్కాందపురాణం చెబుతోంది. ఆ వివరాలను ... విశేషాలను మున్ముందు తెలుసుకుందాం ...


More Bhakti News