శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన కాలమేది ?

శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన కాలంగా 'చాతుర్మాస్యం' చెప్పబడుతోంది. చాతుర్మాస్యం అంటే శ్రావణ .. భాద్రపద .. ఆశ్వీయుజ .. కార్తీకాలనబడే నాలుగు మాసాల కాలంగా చెప్పబడుతోంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిగా చెప్పబడే తొలి ఏకాదశి రోజున వైకుంఠంలోని పాల సముద్రంలో శయనించిన స్వామివారిని, ఈ నాలుగు నెలలపాటు సేవించడాన్ని 'చాతుర్మాస్య వ్రతం'గా చెప్పబడుతోంది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ముగించవలసి వుంటుంది. ఈ నాలుగు నెలల కాలంలో బ్రహ్మచర్యం ... ఏక భుక్తంతో పాటు అనేక ఆహార నియమాలను పాటిస్తూ ఈ వ్రతాన్ని పూర్తి చేయవలసి వుంటుంది.

శ్రావణమాసంలో ఆకు కూరలను ... భాద్రపద మాసంలో పెరుగును ... ఆశ్వీ యుజ మాసంలో పాలను ... కార్తీక మాసంలో పప్పు ధాన్యాలను ఆహారంలో ఉపయోగించకూడదనే నియమం వుంది. అలాగే నిమ్మకాయ ... ఉసిరికాయ ... గుమ్మడి కాయ ... పొట్లకాయ ... పుచ్చకాయ ... తేనె వంటి పదార్థాలకు కూడా దూరంగా వుండాలి. ఈ నాలుగు నెలల పాటు ఎక్కడికీ ప్రయాణాలు చేయకుండా ఒకే దగ్గర ఉంటూ శ్రీమహావిష్ణువు సేవలోనే గడపాలి.

మనసును స్థిరంగా ... ప్రశాంతంగా ఉంచుకుని మౌన వ్రతాన్ని ఆచరిస్తూ స్వామివారి ధ్యానంలో కొనసాగాలి. స్వామిని ఆరాధించకుండా ... ఆయనకి నైవేద్యాన్ని సమర్పించకుండా ఆహారం తీసుకోకూడదు. ఈ మాసాల్లో చేయబడిన స్నానాలు ... వ్రతాలు ... దానాలు ... హోమాలు వంటివి విశేషమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.


More Bhakti News