సోమారామం క్షేత్రానికి గల ప్రత్యేకత ఇదే !

పరమశివుడు ఆవిర్భవించిన పవిత్రమైన క్షేత్రాల్లో 'పంచారామాలు' ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటాయి. శివుడి ప్రాణలింగం అయిదు భాగాలై అయిదు ప్రదేశాల్లో పడగా, అవే పంచారామాలుగా అలరారుతున్నాయి. దేవతల అభ్యర్థన మేరకు తారకాసురుడిని సంహరించడానికి కుమారస్వామి రంగంలోకి దిగుతాడు. తారకాసురుడి పరాక్రమానికి గల కారణం, అతని మెడలో శివుడి ప్రాణలింగం ఉండటమేనని తెలుసుకుని దానిని ఛేదిస్తాడు.

అయిదు ముక్కలైపోయిన శివలింగం అయిదు ప్రదేశాలలో పడుతుంది. ఆ అయిదు ప్రదేశాలే ద్రాక్షారామం ... క్షీరారామం ... సోమారామం ... కుమారారామం ... అమరారామంగా ప్రసిద్ధి చెందాయి. పంచారామాలుగా పేర్కొనబడుతోన్న ఈ అయిదు క్షేత్రాల్లో సోమారామానికి ఒక ప్రత్యేకత వుంది. చంద్రుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం సాధారణ రోజుల్లో తెల్లగా కనిపిస్తూ, రోజు రోజుకీ తన వర్ణాన్ని మార్చుకుంటూ అమావాస్య నాటికి గోధుమ వర్ణాన్ని సంతరించుకుంటుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది.

ఇక రెండు అంతస్తులుగా వున్న ఈ ఆలయంలో సోమేశ్వరుడు క్రింది అంతస్తులోను ... అన్నపూర్ణమ్మ తల్లి పైఅంతస్తులోను దర్శనమిస్తూ వుంటారు. పార్వతీ పరమేశ్వరులు ఈ విధంగా కొలువై ఉండటం ఇక్కడ ఒక్క చోట మాత్రమే కనిపిస్తూ ఉంటుందని చెబుతారు. ఈ విశేషాల కారణంగానే పంచారామాలలో ఈ క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుందని భక్తులు చెప్పుకుంటూ వుంటారు.


More Bhakti News