భగవంతుడు ఏ రూపంలోనైనా రావచ్చు !

వాసుదేవుడి పట్ల కనకదాసు భక్తి శ్రద్ధలు ... భగవంతుడిని ఆయన కీర్తించే తీరు వ్యాసరాయల వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాంతో ఆయన కనకదాసుని ఎంతగానో అభినందిస్తాడు. అసమాన భక్తుడంటూ ఆయనలా కనకదాసుని మెచ్చుకోవడం మిగతా శిష్యులకు అసూయను కలిగిస్తుంది. కనకదాసు అంతటి భక్తుడైతే, ఆయన పిలిస్తే దేవుడు పలకాలి కదా ? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తారు. అలా దేవుడు దిగివచ్చినప్పుడే ఆయన మహా భక్తుడనే విషయాన్ని తాము అంగీకరిస్తామని అంటారు.

నిజమైన భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడనీ, ఆయనని గుర్తించడం ఇతరులకు సాధ్యం కాదని అంటాడు కనకదాసు. దేవుడు ఏ రూపంలో వచ్చినా తాము గుర్తిస్తామనీ, ముందు ఆయనని పిలవమంటూ వాళ్లు ఎగతాళి చేస్తారు. వాళ్ల కళ్లు తెరిపించడం కోసం కనకదాసు వాసుదేవుడిని ప్రార్ధన చేయడం మొదలుపెడతాడు. అలా కొంతసేపు కాగానే ఒక మహా సర్పం ఆశ్రమంలోకి ప్రవేశిస్తుంది.

ఆ మహా సర్పాన్ని చూడగానే ఆ శిష్యులంతా భయంతో కంపించిపోతూ ఆశ్రమం బయటికి పరుగులు తీస్తారు. వ్యాసరాయల వారు ... కనకదాసు ఆశ్రమంలోనే చిక్కుబడిపోయారని ఆందోళన చెందుతూ, కిటికీలో నుంచి తొంగి చూడసాగారు. సర్ప రూపంలో వచ్చినది వాసుదేవుడని గ్రహించిన వ్యాసరాయల వారు ... కనకదాసు, ఆ పాముకి పాలను నైవేద్యంగా సమర్పించి హారతి పడతారు. ఆ సేవలను స్వీకరించిన పాము అదృశ్యమైపోతుంది.

బయటి నుంచి కిటికీ ద్వారా ఈ దృశ్యాన్ని చూసిన శిష్యులు తమ కళ్లను తామే నమ్మలేకపోతారు. గురువు సేవను విడిచి ... పరమాత్ముడి సన్నిధిలో వున్నామనే విషయాన్ని మరిచి ప్రాణ భయంతో పరుగులు తీసినందుకు సిగ్గుపడతారు. సర్ప రూపంలో వచ్చిన దైవాన్ని గుర్తించలేని తమ అజ్ఞానాన్ని నిందించుకుంటారు. అవమానభారంతో తిరిగి ఆశ్రమంలోకి అడుగుపెడుతూ వ్యాసరాయలవారి పాదాలపై పడతారు. కనకదాసును గురించి ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలంటూ అంగీకరిస్తారు.


More Bhakti News