బాధలను తీర్చడమే బాబాకు ఆనందం

శిరిడీ సాయి ఓ సాధారణ ఫకీరుగా ... నిరాడంబరంగా జీవించాడు. కూలిపోవడానికి సిద్ధంగా వున్న మశీదునే సౌధంగా ... ఇటుకనే తలగడగా ... కటిక నేలనే పట్టుపాన్పుగా చేసుకున్నాడు. ఎప్పుడు చూసినా చిరునవ్వులు చిందిస్తూ సంతృప్తికి మించిన సంపదలేదని చాటిచెప్పాడు. తనకి ఎవరూలేరని చెబుతూనే అందరినీ తన వాళ్లుగా చేసుకున్నాడు. వాళ్ల కష్ట నష్టాలను తనవిగా చేసుకుంటూ, ప్రతి ఇంటికీ ఓ పెద్ద దిక్కయ్యాడు ... ప్రతి మనసుకి ఒక దేవుడయ్యాడు.

ఈ కారణంగానే బాబా ఆలయాలు అనేక ప్రాంతాలలో నిర్మించబడుతున్నాయి. విశిష్టత గల అలాంటి ఆలయాల జాబితాలో 'చింతపల్లి' ఒకటిగా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి సాగర్ వెళ్లే మార్గంలో ... నల్గొండ జిల్లా పరిధిలో ఈ ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తుడు, బాబా పట్ల గల భక్తి భావంతో ఆలయ నిర్మాణానికి సంకల్పించాడు. గ్రామస్తుల సహాయ సహకారాలు కూడా తోడు కావడంతో, ప్రశాంతతకు ప్రతీకగా ఇప్పడు కనిపిస్తోన్న ఆలయం రూపుదిద్దుకుంది.

సువిశాలమైన ప్రాంగణంలో రెండు అంతస్తులను కలిగి ఈ ఆలయం కనిపిస్తుంది. ఉద్యానవనాన్ని తలపించే విధంగా ఆలయం చుట్టూ పచ్చదనమే దర్శనమిస్తూ వుంటుంది. ఆలయం పైభాగంలో సాయిని దర్శించుకున్న భక్తులు, క్రింది అంతస్తులోని ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకుంటూ వుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన భక్తులకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. నిరంతరం ఇక్కడ జరిగే సాయి నామస్మరణం ఆధ్యాత్మిక పరమైన ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటుంది.

శిరిడీలో మాదిరిగానే బాబాకి అభిషేకాలు ... అలంకరణలు ... హారతులు ... సేవలు జరుగుతుంటాయి. బాబాను దర్శించడానికి వచ్చిన భక్తులకు 'లేదు' అనకుండా నిత్యం అన్నదానాన్ని నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి బాబాను దర్శించడం వలన బాధలు తొలగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News