ఇలా దేవుడి మనసు గెలుచుకోవచ్చు

జీవితంలో కష్టనష్టాల నుంచి విముక్తి కలగడానికీ, సుఖసంతోషాలను పొందడానికి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఆయన ఆదరణ ... అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయలేరనే విషయాన్ని భక్తులంతా అంగీకరిస్తూ వుంటారు. అందువల్లనే ఆయనని అనేక విధాలుగా పూజిస్తూ వుంటారు ... అంకిత భావంతో ఆరాధిస్తూ వుంటారు.

అయితే భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి పూజతో పాటు అనేక మార్గాలున్నాయనే విషయాన్ని గ్రహించాలి. అందులో ఒకటిగా .. శిధిలావస్థలో వున్న ఆలయాలను బాగుచేయడమని చెప్పవచ్చు. కొన్ని ప్రాచీన ఆలయాలను దర్శించుకున్నప్పుడు, అక్కడి పౌరాణిక నేపథ్యం గురించీ ... చారిత్రక వైభవం గురించి తెలుస్తుంది. అంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఆ ఆలయం శిధిలావస్థకు చేరుకోవడం మనసుకి బాధ కలిగిస్తుంది.

పుచ్చిమొక్కలు పెరిగిన ఆలయ ప్రాంగణం ... అక్కడక్కడా దెబ్బతిన్న గోపురం ... గోడలపై కూడా పెరుగుతోన్న చెట్లు ... రంగులు లేక వెలవెలబోతోన్న మంటపాలు ... కదిలిపోయిన స్తంభాలు ... పూడిపోయిన కోనేరు ఆలయ దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంటాయి. అందరికీ నాథుడిగా చెప్పుకునే దేవుడు ... అనాథగా వదిలివేయబడ్డాడనే ఆలోచన మనసుని కదిలించి వేస్తుంది. ఇలాంటి దేవాలయాలు ఎన్నో వుండి ఉంటాయనే ఆలోచన మనసుకి మరింత కష్టాన్ని కలిగిస్తుంది.

అలాంటి దేవాలయాలను చూసి ఒక నిట్టూర్పు విడిచి వచ్చేయడం వలన ఎలాంటి ప్రయోజనం వుండదు. ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతోన్న దేవాలయాల అభివృద్ధి కోసం తమ వంతుగా ఏం చేయగలమని ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మిక భావాలు కలిగిన కొంతమంది స్నేహితులను కూడగట్టగలిగితే, సెలవు రోజుల్లో ఆలయాలను బాగుచేసే పనికి పూనుకోవచ్చు. ఆలయ సిబ్బంది అనుమతితో అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా చేయవచ్చు. అక్కడి గ్రామస్తులను చైతన్య పరిచి అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ల సహాయ సహకారాలను తీసుకోవచ్చు. ఆర్ధికపరమైన వనరుల కోసం, భక్తి భావన కలిగిన స్థితిమంతులను ప్రోత్సాహించవచ్చు.

ఈ విధంగా కొంతమంది చేయడం వలన, వారి నుంచి మరికొంత మంది స్పూర్తిని పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వాళ్లు తమకి దగ్గరలో గల ఆదరణ కరవైన ప్రాచీన ఆలయాలను ఎంచుకుని, వాటిని బాగు చేయడానికి శ్రీకారం చుట్టాలి. ఎవరి శక్తికి తగిన పనులను వాళ్లు ఎంచుకుని రంగంలోకి దిగాలి. ఈ విధంగా చేయడం వలన పాడుబడుతోన్న ఆలయాలు కడిగిన ముత్యాల్లా కళకళలాడుతూ కనిపిస్తాయి. అందుకు పూనుకున్నవారికి సంతృప్తినిస్తూ పూర్వ వైభవంతో వెలుగొందుతాయి.


More Bhakti News