దత్త మాయను తెలుసుకో తరమా ?

కృష్ణా నదిలో స్నానమాచరిస్తూ ... 'గాణుగాపురం'లో భిక్ష చేస్తూ ... అనునిత్యం దత్తాత్రేయస్వామిని స్మరిస్తూ ఒక సాధువు తన జీవితాన్ని కొనసాగించసాగాడు. అలా కొంతకాలం గడిచాక, దత్తాత్రేయస్వామి కూడా ఏదో ఒక రూపంలో అక్కడి కృష్ణానదిలో స్నానం చేయడానికి వస్తుంటాడనీ, గాణుగాపురంలో తప్పక భిక్ష చేసి వెళుతుంటాడనే విషయం ఆయనకి తెలుస్తుంది.

అయితే దత్తుడు ఎప్పుడు ఏ రూపంలో వస్తాడనేది ఎవరికీ తేలియదు. మరి ఆయనని గుర్తించడం ఎలా అనే ఆలోచన ఆ సాధువును సతమతం చేయసాగింది. ఎలాగైనా సరే మారువేషంలో వచ్చే దత్తుడిని కనిపెట్టవలసిందే ... ప్రత్యక్షంగా ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందేనని నిర్ణయించుకుంటాడు. ఆ క్షణం నుంచి నదీ తీరానికి వచ్చిపోయే వారిని అదేపనిగా పరిశీలించడం మొదలుపెడతాడు.

అలా ఒకరోజు ఆయన నదీ తీరంలోనే ఎక్కువ సమయాన్ని గడిపి, భిక్ష కోసం ఆలస్యంగా ఊళ్లోకి వెళతాడు. ఆయన ఏ గుమ్మం ముందు నుంచుని ఎవరిని పిలిచినా, వాళ్లు వాకిట్లోకి వస్తూనే .. ''ఇంతకు ముందేగా నీకు భిక్ష వేసింది ... వెంటనే వచ్చావేం'' అంటూ విసుక్కోసాగారు. వాళ్ల ధోరణి ఆయనకి ఆశ్చర్యాన్నీ ... అయోమయాన్ని కలిగిస్తుంది. తీరికగా కూర్చుని ఆలోచించిన ఆయనకి అసలు విషయం అర్థమవుతుంది.

దత్తాత్రేయుడు ఏ రూపంలో వస్తాడోనని తాను ఎదురుచూస్తుంటే, తన రూపంలోనే ఆయన వచ్చి భిక్ష చేశాడని గ్రహిస్తాడు. దత్తుడు తన రూపాలను ... మహిమలను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదనే విషయాన్ని తెలియజెప్పడం కోసమే అలా చేశాడని అనుకుంటాడు. స్వామి అనుగ్రహం కోసం కృషి చేయాలేగానీ, ఆయనని కనిపెట్టడానికి ప్రయత్నించకూడదని నిర్ణయించుకుంటాడు. ఆ క్షణం నుంచి స్వామివారిని మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధించడం మొదలుపెడతాడు.


More Bhakti News