దేవుడు ప్రత్యక్షమైతే ఇలా ఎవరు కోరుకుంటారు

దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే ఒక్కొక్కరి నుంచి ఒక్కో సమాధానం వస్తూ వుంటుంది. అప్పటి వరకూ తాము ఇష్టపడి పొందలేనివీ, తమకి అనంతమైన ఆనందాన్ని కలిగించేవి అడుగుతుంటారు. కొందరు ధనాన్నీ ... మరి కొందరు అందాన్నీ ... ఇంకొందరు ఆరోగ్యాన్ని కోరుతుంటారు. ఇలా ఏదైతే లేని కారణంగా తమ జీవితం అసంతృప్తితో కొనసాగుతోందని భావిస్తూ వుంటారో, వాటిని అడగడానికే ఆసక్తిని చూపుతుంటారు.

ఆశలో నుంచే అనేక కోరికలు పుట్టుకొస్తూ వుంటాయి కాబట్టి, ఏది ముందుగా నెరవేర్చుకోవాలో తెలియక తికమకపడిపోయే వాళ్లు కూడా ఎంతోమంది వుంటారు. చాలామంది ఇలాంటి సమయంలో ఇతరుల గురించి ఆలోచించరు. తమకేం కావాలో కోరుకోవడంపై మాత్రమే దృష్టి పెడుతుంటారు. కొందరు నిస్వార్థపరులు ... త్యాగధనులు మాత్రం తమతో పాటు అందరూ సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటూ వుంటారు.

అలాంటి వారిలో 'రంతిదేవుడు' ముందువరుసలో కనిపిస్తాడు. ఒకసారి రంతిదేవుడి కఠోర తపస్సుకు మెచ్చి దేవేంద్రుడు ప్రత్యక్షమవుతాడు. రంతిదేవుడిని ప్రశంసిస్తూ, ఆయన కోరుకునేదేదైనా ప్రసాదిస్తానని చెబుతాడు. కానీ రంతిదేవుడు తన గురించి ఏమీ కోరుకోడు. తన రాజ్యంలోని ప్రజలతో పాటు మిగతా రాజ్యంలోని ప్రజలంతా కూడా ఆనందంతో హాయిగా ఉండేలా చేయమని కోరతాడు. అతివృష్టి ... అనావృష్టి అనేవి రాకుండా అన్ని ప్రాంతాలు సుభీక్షంగా ఉండేలా చూడమని అంటాడు.

అంతే కాకుండా ప్రజల మధ్య అసూయాద్వేషాలు నశించి, వారి మధ్య స్నేహభావం పెంపొందేలా చేయమని అడుగుతాడు. నిరంతరం ప్రజా సేవలో పాల్గినేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు తనకి ప్రసాదించమని కోరతాడు. మహనీయులు లోక కళ్యాణాన్ని మాత్రమే కోరుకుంటారనే విషయం దేవేంద్రుడికి మరోమారు స్పష్టమవుతుంది. అసమానమైన భక్తుడిగానే కాదు, అంతకుమించిన నిస్వార్థపరుడిగా తన ఎదుట నిలిచిన రంతిదేవుడి వ్యక్తిత్వానికి దేవేంద్రుడు ఆశ్చర్యపోతాడు ... ఆయనను అభినందించకుండా ఉండలేకపోతాడు.


More Bhakti News