శనిదేవుడి అనుగ్రహం కోసమే ఈ పూజ !

శనిదేవుడు తమ జీవితంలోకి ప్రవేశించాడనే మాటను ఎవరూ కూడా ధైర్యంగా వినలేరు. ఆయన రాకతో తమ జీవితం ఎలాంటి అనూహ్యమైన మలుపులు తిరుగుతుందోననే ఆందోళన వారిని వెంటాడుతూ వుంటుంది. సాధ్యమైనంత త్వరగా ఆయనని శాంతింపజేసి, రానున్న కష్టాల నుంచి బయటపడాలనే ఆరాటంతో ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో కొంతమంది శని త్రయోదశి రోజున ఆయనకి తైలాభిషేకం నిర్వహిస్తూ వుంటే, మరికొందరు శాంతి హోమాలు ... జపాలు చేయించడంలో నిమగ్నమైపోతారు. ఇలా శనిదోషం బారి నుంచి బయటపడటానికి భక్తులు అధికంగా వచ్చే శని క్షేత్రాలలో 'పావగడ' ఒకటిగా చెప్పుకోవచ్చు. కర్ణాటక - తుమకూరు జిల్లా పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది.

ఏలినాటి శనితో బాధలుపడుతోన్న వాళ్లు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇలా వచ్చే వారి సంఖ్య శ్రావణ మాసంలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి సంబంధించిన ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఈ మాసంలోనే జరుగుతుంటాయి. ప్రత్యేక పూజగా ఇక్కడ నిర్వహించే 'ప్రాకారోత్సవ పూజ' కు ఎంతో ప్రాధాన్యత వుంది. శనిదేవుడి ఆయుధంగా చెప్పబడుతోన్న 'వెండిగద' ను భక్తులు తమ భుజాన పెట్టుకుని ఆలయం చుట్టూ తిగడమే ప్రాకారోత్సవ పూజగా కనిపిస్తుంది.

ఫలానా వారు మాత్రమేననే నియమమేదీ లేకుండా అందరూ ఈ ఉత్సవంలో పాల్గొనవచ్చు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో మేళతాళాలతో ఊరేగింపుగా నడుస్తూ ఈ ప్రాకారోత్సవ పూజలో పాల్గొంటూ వుంటారు. ఈ విధంగా చేయడం వలన శనిదేవుడి మనసు గెలుచుకోబడుతుందనీ, ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.


More Bhakti News