అలా శివపార్వతులు ఇక్కడ ఆవిర్భవించారు

భక్తులను ఉద్ధరించడం కోసం శివపార్వతులు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. ఈ నేపథ్యంలో ఒక్కో క్షేత్రంలో వాళ్లు కొలువైన తీరు వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథనం దాగి వుంటుంది. ఆశ్చర్యచకితులను చేసే అలాంటి పురాణపరమైన కథనం ఒకటి 'యాగంటి' లో వినిపిస్తుంది. విశిష్టమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రం కర్నూలు జిల్లా పరిధిలో దర్శనమిస్తుంది.

ఒకప్పుడు తన పర్యటనలో భాగంగా ఈ ప్రదేశానికి చేరుకున్న అగస్త్యమహర్షి, ఇక్కడి స్థల మహాత్మ్యాన్ని గుర్తిస్తాడు. ఇక్కడి ప్రశాంతత ... ఆహ్లాదకరమైన వాతావరణం ఆయనను మంత్రముగ్ధుడిని చేస్తాయి. దాంతో పవిత్రమైన ఈ ప్రదేశంలో విష్ణుమూర్తిని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా సుందరమైనటువంటి విష్ణుమూర్తి ప్రతిమను సిద్ధం చేస్తాడు. అయితే ఆ విగ్రహం చిటికెన వ్రేలు దగ్గర దెబ్బతింటుంది.

విష్ణుమూర్తి విగ్రహం భిన్నం కావడం అగస్త్యమహర్షి మనసుకి కష్టం కలిగిస్తుంది. జరిగిన దానికి కారణమేమిటో తెలుసుకోవడం కోసం ఆయన శివపార్వతులను గురించి తపస్సు చేస్తాడు. శివపార్వతులు ప్రత్యక్షం కావడంతో, తాను ప్రతిష్ఠించాలనుకున్న విగ్రహం దెబ్బతినడానికీ .. తాను తలపెట్టిన కార్యానికి భంగం కలగడానికి కారణమేమిటని అడుగుతాడు. గంగాదేవి నెలకొని వున్న ఈ ప్రదేశం తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రమనీ, అందువలన ఇక్కడ శివాలయం నిర్మించడం మాత్రమే సాధ్యమవుతుందని ఆదిదంపతులు చెబుతారు.

విషయం తెలుసుకున్న అగస్త్యుడు, ఏకశిలా మూర్తులుగా ఆ ప్రదేశంలో ఆవిర్భవించమని శివపార్వతులను కోరతాడు. ఆయన అభ్యర్థనను శివపార్వతులు అంగీకరించగా, వాళ్లను వదిలి ఉండలేని నందీశ్వరుడు కూడా ఇక్కడ స్వయంభువుగా కొలువుదీరతాడు. అలా ఆవిర్భవించిన బసవన్న అంతకంతకూ పెరుగుతూ వుండటం ఇక్కడి విశేషం. శివపార్వతులతో పాటు నందీశ్వరుడు స్వయంభువుగా ఆవిర్భవించిన మహిమాన్వితమైన ఈ క్షేత్రం, దర్శనమాత్రం చేతనే ధన్యులను చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News