ఈ ప్రసాదం సంతానాన్ని ఇస్తుందట !

మారుమూల ప్రాంతాలలో గల ఆలయాల నుంచి మహా పుణ్యక్షేత్రాల వరకూ ఎక్కడికి వెళ్లినా అక్కడి తీర్థ ప్రసాదాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తీర్థ ప్రసాదాలు లభించినప్పుడే యాత్రాఫలం పరిపూర్ణంగా దక్కినట్టు భావించడం జరుగుతూ వుంటుంది. లేదంటే తమ వలన ఏదైనా అపరాధం జరిగి ఉంటుందనే సందేహం వెంటాడుతూ వుంటుంది.

ఈ నేపథ్యంలో ఒక్కో క్షేత్రంలో ఒక్కో ప్రసాదం విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. విశేషమైన పర్వదినాల్లో భగవంతుడికి నివేదన చేయబడిన ప్రత్యేక ప్రసాదాలను స్వీకరించడం వలన భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయని చెబుతుంటారు. అలాంటి ప్రత్యేకత గల క్షేత్రం మనకి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల 'కాళ్లకూరు'లో దర్శనమిస్తుంది.

ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన వేంకటేశ్వరస్వామి కాళ్లు భూమిలో కూరుకుపోయి ఉండటం వలన ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ప్రతి సంవత్సరం 'వైశాఖ శుద్ధ ఏకాదశి' రోజున ... 'ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి' రోజున ఇక్కడ స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగానే ఇక్కడ ప్రత్యేక నైవేద్యంగా స్వామివారికి పొంగలి నివేదన చేయబడుతుంది.

సంతాన లేమితో బాధపడుతోన్న వాళ్లు ఈ పొంగలి ప్రసాదాన్ని అపురూపంగా భావించి స్వీకరిస్తుంటారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే ఈ విశేష పుణ్య తిథుల్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పొంగలి ప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా తిరిగి వెళుతూ వుంటారు.


More Bhakti News