ఆశ్చర్యచకితులను చేసే అరుదైన క్షేత్రం

జీవితమంటేనే ఓపిక ఉన్నంత వరకూ బరువు బాధ్యతలను మోయడం. కటుంబ పరిస్థితులను ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ, పిల్లలను ఒక స్థాయికి తీసుకురావడం. ఇక వాళ్లకి ఏ లోటూ లేకుండా చేశామని తేలికగా ఊపిరి పీల్చుకునే సరికి వయసైపోతుంది. బాధ్యతలను వదిలించుకునేసరికి అనారోగ్యాలు అక్కున చేరతాయి. దాంతో బాధ్యతలు తీరగానే పుణ్య క్షేత్రాలను దర్శించాలనుకున్న వాళ్ల ఆశలు నిరాశలైపోతాయి. ఓపిక ఉన్నప్పుడే కాస్త తీరిక చేసుకుని క్షేత్ర దర్శనం చేసి వస్తే బాగుండేదని నిట్టూరుస్తుంటారు.

అలాంటివారి ఆధ్యాత్మిక చింతనకు సంతృప్తిని కలిగించే క్షేత్రం ఒకటి 'ప్రొద్దుటూరు' లో దర్శనమిస్తుంది. కడపజిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం, యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటూ వుంటుంది. ఆకర్షణీయమైన శైలిలో అత్యంత వ్యయప్రయాసలకోర్చి నిర్మించబడిన ఈ ఆలయంలో ప్రధాన దైవంగా 'అమృతేశ్వరుడు' కొలువై వుంటాడు. ఇక ఇదే ప్రాంగణంలో అష్టాదశ శక్తి పీఠాలకు ... ద్వాదశ జ్యోతిర్లింగాలకు నమూనాలను ఏర్పాటుచేశారు.

ఆలయ ప్రాంగణంలో ధ్యానం చేసుకుంటూ కనిపించే సదాశివుడినీ ... క్షేత్ర పాలకుడిగా ఆశీనుడైన ఆంజనేయస్వామి ప్రతిమను చూసి తీరవలసిందే. ఆలయ ప్రాంగణంలో గల ప్రాకారాలపై పురాణ సంబంధమైన దృశ్యాలను అత్యద్భుతంగా మలిచారు. ఆలయాల సముదాయంగా కనిపించే ఈ క్షేత్రంలోకి అడుగుపెడితే, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది.

భక్తుల బలమైన సంకల్పం కారణంగా నిర్మించబడిన ఈ ఆలయాన్ని దర్శించడానికి అనేక ప్రాంతాలనుంచి యాత్రికులు తరలివస్తుంటారు. అష్టాదశ శక్తిపీఠాలను ... ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునే అవకాశం కలిగినందుకు ఆనందపడిపోతుంటారు. ఈ రోజుల్లో మనిషికి కావలసిన ఔషధం మానసిక ప్రశాంతతే ... అది ఇక్కడ కావలిసినంత లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News