సర్పరూపంలో ఆవుపాలు తాగిన శివుడు !

పరమశివుడు ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన ... విశిష్టమైన క్షేత్రాలలో 'వెల్లూర్' ఒకటిగా చెప్పబడుతోంది. తమిళనాడు ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రంలో సదాశివుడు జలకంఠుడిగా ... అమ్మవారు అఖిలాండేశ్వరిగా పూజాలు అందుకుంటున్నారు. ఇక్కడ స్వామివారు ఆవిర్భవించిన విధానాన్ని పరిశీలిస్తే, ఈ ప్రదేశం ఎంతటి మహిమాన్వితమైనదనే విషయం తెలుస్తుంది.

పూర్వం తెలుగువాడైన ఒక రైతు కొంతకాలం పాటు ఈ ప్రదేశంలో ఉన్నాడట. ఆయన ఆవుల మందలో అయిదు పాలిండ్లు కలిగిన ఆవు ఒకటి ఉండేదట. దానిని దేవతా గోవుగా భావించిన రైతు, అపురూపంగా చూసుకుంటూ ఉండేవాడు. ఒకసారి మేతకు వెళ్లిన అది తన అయిదు పాలిండ్ల ద్వారా అయిదు శిరస్సులు కలిగిన నాగుపాముపై పాలధారలు కురిపిస్తూ వుండటం చూసిన ఆ రైతు తన కళ్లను తానే నమ్మలేకపోతాడు.

ఆ నాగుపాము ఒక పుట్టపైకి పాకుతూ వెళ్లి అదృశ్యమవడం చూసి ఆ రైతు మరింత ఆశ్చర్యపోతాడు. ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు. ఆ రాత్రి ఆయనకి శివుడు స్వప్న దర్శనమిచ్చి, ఆ నాగుపాము కనిపించిన పుట్టలో తాను లింగరూపంలో ఉన్నాననీ, తనకి ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. స్వామివారి ఆదేశం మేరకు మరునాడు ఉదయమే ఆ రైతు ఆ పుట్ట దగ్గరికి చేరుకుంటాడు.

పుట్టలోపల నిధితో పాటు నీటిచెలమ ఉండటం చూసి ఆనందాశ్చర్యలకి లోనవుతాడు. నిధిని బయటికి తీసి .. నీటి చెలమలో కంఠభాగం వరకూ మునిగివున్న శివలింగానికి అక్కడే ఆలయాన్ని నిర్మిస్తాడు. జలంలో కంఠం వరకూ వుండి వెలుగు చూసిన కారణంగా ఇక్కడి స్వామిని జలకంఠుడిగా కొలుస్తుంటారు. ఇంతటి మహిమాన్వితమైన సంఘటనకు వేదికగా నిలిచిన 'వెల్లూర్' ను జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరాలని చెప్పొచ్చు.


More Bhakti News