బాధలను దూరంచేసే బాబా ఆలయం

శిరిడీలో వున్న ప్రజలు తమ పనులన్నీ చకచకా పూర్తిచేసుకుని మశీదులో వున్న బాబా దగ్గరికి చేరుకునే వాళ్లు. ఎందుకంటే ఆ మశీదు వాళ్లకి ప్రేమానురాగాలను అందించే మందిరంలా అనిపించేది .. ఆప్యాయంగా పలకరించే అమ్మలా కనిపించేది. ఈ కారణంగానే బాబాను చూడకుండా ... ఆయన మశీదుకు రాకుండా వాళ్లు ఉండలేకపోయే వాళ్లు.

ఇక ఈనాటికీ బాబా భక్తులది ఇదే పరిస్థితి. బాబా ఆలయానికి రాకుండా ... ఆయన హారతులు పాడకుండా ... ఆయన పల్లకీని మోయకుండా ఉండలేని భక్తులు ఎందరో వున్నారు. అలాంటి భక్తులతో సందడిగా కనిపించే ఆలయాల్లో గుంటూరు జిల్లా 'చిలకలూరి పేట' కి చెందిన బాబా ఆలయం ఒకటిగా దర్శనమిస్తుంది.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం పవిత్రతకు .. ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. చక్కని నగిషీలతో తీర్చిదిద్దిన మంటపం మనసును కట్టిపడేస్తుంది. వేదికపై పాలరాతి మూర్తిగా దర్శనమిచ్చే సాయిని చూడగానే, ఆనందంగా ... ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆయనపై భక్తుల దృష్టి ఉన్నంత వరకూ బాధలను మరిచిపోతుంటారు. ఆయన దృష్టి భక్తులపై పడగానే ఆ బాధలు శాశ్వతంగా దూరమవుతాయి. ఎంతోమంది భక్తులు ఈ విషయాన్ని ఇక్కడ అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.

మిగతా రోజుల కంటే ఘనంగా ఇక్కడ బాబాకి గురువారం రోజున పూజలు ... సేవలు జరుగుతుంటాయి. అలాగే విశేషమైన పర్వదినాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కొండంత అండగా నిలిచి కోరిన వరాలను అందించే ఇక్కడి సాయిని భక్తులు అత్యంత శ్రద్ధతో ఆరాధిస్తూ వుంటారు ... ఆయన అనుగ్రహాన్ని సంపాదిస్తూ వుంటారు.


More Bhakti News