ఆ దంపతులను తాకలేకపోయిన అగ్నిదేవుడు

ఎంతోమంది పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమను ఈ లోకానికి చాటిచెప్పారు. అలాంటి పతివ్రతలలో హరిశ్చంద్రుడి భార్య 'చంద్రమతి' ముందువరుసలో కనిపిస్తుంది. హరిశ్చంద్రుడితో పాటు రాజ్యభోగాలను అనుభవించిన ఆమె, ఆ తరువాత భర్తతోపాటు నానాకష్టాలు పడుతుంది. అయినా ఆమె ఏనాడు భర్త ధోరణి పట్ల అసహనాన్ని ప్రదర్శించలేదు.

తన భర్త సత్య ధర్మాలను తప్పకుండా ఉండటం కోసం చంద్రమతి తనవంతు కృషి చేస్తుంది. అందుకోసం ఆమె చూపిన సహనం ... త్యాగం మహిళా లోకానికే ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఇచ్చిన మాట ప్రకారం విశ్వామిత్రుడికి తన రాజ్యాన్ని ధారపోసి, భార్యా బిడ్డలతో అక్కడి నుంచి బయలుదేరుతాడు హరిశ్చంద్రుడు. తనకి రావలసిన సొమ్మును రాబట్టుకోవడం కోసం తన శిష్యుడైన 'నక్షత్రకుడు'ని కూడా వాళ్ల వెంట పంపిస్తాడు విశ్వామిత్రుడు.

అంతా కలిసి ఓ దట్టమైన అడవీ మార్గంలో ప్రయాణిస్తూ వుంటారు. అదే సమయంలో అడవంతా తగలబడుతూ ఆ దావానలం వాళ్ల వైపు వేగంగా వస్తూ వుంటుంది. అది తమను దహించి తీరుతుందని భావించిన హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడికి ఇవ్వవలసిన సొమ్మును ఇవ్వకుండా మరణిస్తే ఆయనకి ఇచ్చిన మాటను తప్పినట్టు అవుతుందని బాధపడుతుంటాడు.

భర్త మనసును అర్థం చేసుకున్న చంద్రమతి, మీదకి దూసుకు వస్తోన్న మంటలకు ఎదురుగా వెళ్లి అవి తన భర్తను తాకకుండా అడ్డుగా నిలుస్తుంది. తన భర్తకి సత్యధర్మాలను కాపాడటం మినహా మరో ఆలోచన లేదనీ, నిరంతరం పతిసేవలో తరించడం మినహా తనకి మరో ధ్యాసలేదని అగ్నిదేవుడితో చెబుతుంది. ఈ రెండు విషయాలను ఒక దీక్షలా తాము ఆచరిస్తూ వస్తున్నామనీ, అది నిజమేనని అంగీకరించినట్టయితే వెనక్కి తగ్గమని కోరుతుంది.

తన పాతివ్రత్య మహిమచే సూర్య చంద్రులను ఆమె శాసించగలదనే విషయం అగ్నిదేవుడికి అర్థమైపోతుంది. అలాగే సత్యశీలుడైన హరిశ్చంద్రుడిని సమీపించడం కూడా అంత తేలికకాదనే విషయం ఆయనకి స్పష్టమవుతుంది. అంతే అగ్నిదేవుడు ఆ క్షణమే అక్కడి నుంచి వెనక్కి తిరుగుతాడు. అప్పటి వరకూ అడవిని దహించివేస్తూ ముందుకు దూసుకు వచ్చిన మంటలు వెనక్కి తగ్గుతూ కనుమరుగైపోతాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన అగ్నిదేవుడికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడి నుంచి బయలుదేరుతారు.


More Bhakti News