పీడ కలలు రాకుండా ఏంచేయాలి ?

కలలు రావడం సహజం ... అయితే వాటిలో ఆనందాన్ని కలిగించేవి, ఆందోళనను కలిగించేవి వుంటాయి. మంచి కల వచ్చిందంటే మరునాడు ఆ కలను గురించి తలచుకుంటూ సంతోషంగా ... ఉత్సాహంగా గడపడం జరుగుతుంది. ఇక పీడకల వస్తే ఆ రోజంతా కూడా భయంభయంగానే గడుస్తుంది. మళ్లీ అలాంటి కల వస్తుందేమోనని మనసు ఆందోళనకి లోనవుతూ వుంటుంది.

'కల'అనే విషయం నిద్రలో నుంచి బయటికి వచ్చేంత వరకూ తెలియదు కాబట్టి, అది నిజమనే అనిపిస్తూ వుంటుంది. అందువలన పీడకల వచ్చినప్పుడు మనసు తీవ్రమైన వత్తిడికి గురవుతూ, అలజడికి లోనవుతూ వుంటుంది. వరుసగా ఒక రెండురోజుల పాటు పీడకల వచ్చిందంటే, మూడోరోజున నిద్రకి ఉపక్రమించడానికి భయపడుతూ వుంటారు. సాధారణంగా మనసు అల్లకల్లోలంగా ఉండటం వల్లనే పీడకలలు వస్తాయని చెబుతుంటారు. అందువలన నిద్రకి ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చేయాలి.

అయినా పీడకలలు తరచుగా వచ్చి ఆందోళన కలిగిస్తూ వుంటే, దేవాలయంలో గల ఆంజనేయస్వామి మూలమూర్తి నుంచి తీసిన సిందూరాన్ని నుదుటున ధరించడం మంచిది. అలాగే హనుమంతుడి రూపును మెడలో ధరించడం వలన ... హనుమాన్ చాలీసాను చదువుకోవడం వలన కూడా ఫలితం కనిపిస్తుంది. ఇక కాస్త గుర్తు పెట్టుకో గలిగితే '' రామ స్కందం హనుమంతం .. వైనతేయం వృకోదరం .. శయనేయః పఠెన్నిత్యం .. దుస్స్వప్నం తస్యనశ్యతి '' అనే శ్లోకాన్ని నిద్రపోవడానికి ముందు చదువుకోవడం వలన కూడా ప్రయోజనం కనిపిస్తుంది.


More Bhakti News