నాగేంద్రుడికి దర్శనమిచ్చిన నారాయణుడు

ఎంతోమంది దేవతలు ... మహర్షులు ... మహా భక్తులు శ్రీమన్నారాయణుడిని గురించి తపస్సు చేశారు. అసమానమైన వారి భక్తికి మెచ్చిన భగవంతుడు, వాళ్లు కోరినవి ఆనందంగా అనుగ్రహించాడు. ఈ నేపథ్యంలో భక్తుల కోరికమేరకు స్వామి ఆయా ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అవన్నీ కూడా పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి. అశేష భక్త జనకోటికి విశేష ఫలితాలను అందిస్తున్నాయి. అలాంటివాటిలో నూటాఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి.

ఈ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా 'తిరునాగై' గా పిలవబడుతోన్న 'నాగపట్టణం' దర్శనమిస్తుంది. ఓడరేవుగా ప్రసిద్ధిచెందిన ఈ ప్రాంతం తమిళనాడు - తంజావూరు సమీపంలో విలసిల్లుతోంది. పూర్వం నాగేంద్రుడు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారాన్ని కోరుతూ ఈ ప్రదేశంలో తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి 'నాగపట్టణం' అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.

ఇక్కడి స్వామివారు 'సౌందర్యరాజ పెరుమాళ్' పేరుతోను ... అమ్మవారు సౌందర్య వల్లి తాయారు పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాన్ని ఎంతోమంది రాజులు దర్శించారు. ఆలయ నిర్మాణంలోను ... అభివృద్ధిలోను తమవంతు పాత్రను పోషించారు. ఆలయంలోని ప్రతి నిర్మాణం ఆనాటి వారి అంకితభావానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది.

తిరుమంగై ఆళ్వారులు స్వామివారిని కీర్తించి తరించిన ఈ క్షేత్రం, ఆనాటి వైభవాన్ని అందంగా ఆవిష్కరిస్తూ దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి స్వామివారినీ ... అమ్మవారిని దర్శించడం వలన సకలశుభాలు చేకూరతాయి. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడ జరిగే ఉత్సవాలు కనువిందు చేస్తాయి. అడుగడుగునా భక్తి భావ పరిమళాలను వెదజల్లుతూ భారీగా జరిగే ఈ సందడిని చూస్తుంటే, ఎవరికైనా ఆ స్వామి సన్నిధిలోనే ఉండిపోవాలనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News