పీటపై వెలసిన స్వామివారి పాదముద్రలు !

అక్కల్ కోటకి చెందిన ఒక భక్తుడు స్వామివారిని అనునిత్యం ఆరాధిస్తూ ఉండేవాడు. స్వామిని ఎప్పుడు చూడాలనిపించినా వెంటనే వెళ్లి ఆయన దర్శనం చేసుకుని వచ్చేవాడు. అయితే ఎప్పుడూ కూడా ఆయన తన కోసం ఏమీ కోరుకోకపోవడం స్వామికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకసారి ఆ భక్తుడు తన ఇంట్లోని పూజా మందిరం చెంత కూర్చోబోతుండగా, అక్కల్ కోట స్వామి స్వయంగా ఆయన ఇంటికి వస్తాడు.

హఠాత్తుగా తన ఇంట్లో ప్రత్యక్షమైన స్వామివారిని చూసి ఆయన తన కళ్లను తానే నమ్మలేకపోతాడు. తన ఇంట్లో స్వామి అడుగుపెట్టడం తాను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంగా భావించి ఆయన పాదాలకు నమస్కరిస్తాడు. అక్కల్ కోట స్వామిని సాదరంగా ఆహ్వానించి, ఆయనను ఓ పీటపై కూర్చోబెడతాడు. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించడం కోసం తెచ్చిన వివిధ రకాల పూలను ... ఫలాలను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామికి సమర్పిస్తాడు.

ఇలా ప్రతి రోజు పూజా సమయానికి స్వామి ఆ భక్తుడి ఇంటికి చేరుకునేవాడు. దేవుడే తన ఇంటికి ప్రత్యక్షంగా వచ్చాడని భావించిన ఆయన, నేరుగా స్వామినే పూజిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిపోతుంది ... స్వామిపట్ల ఆ భక్తుడికి గల విశ్వాసం మరింత బలపడుతుంది. అతని అంకితభావం నచ్చడంతో, తన నుంచి ఏం కావాలన్నా అడగమని అంటాడు స్వామి. జీవితాంతం ఆయన పాదాలను సేవించుకునే భాగ్యాన్ని కల్పించమని కోరతాడు ఆ భక్తుడు.

తనపట్ల అతనికి గల విశ్వాసం స్వామి మనసును గెలుచుకుంటుంది. ఆ వరాన్ని అనుగ్రహిస్తున్నట్టుగా చెప్పేసి, స్వామి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పటి వరకూ స్వామివారు కూర్చున్న పీటపై ఆయన పాదముద్రలు ఉండటం చూసి ఆ భక్తుడు ఆనందాశ్చర్యలకి లోనవుతాడు. ఆనాటి నుంచి చివరినిమిషం వరకూ ఆయన ఆ పాదుకలను విడవలేదు ... వాటి సేవను మరువలేదు.


More Bhakti News