కొండపై శివుడు కొండకింద శ్రీనివాసుడు

సాధారణంగా వైష్ణవ క్షేత్రాల్లో శివుడు కొలువై వుండటం ... శైవ క్షేత్రాల్లో విష్ణుమూర్తి పూజలు అందుకుంటూ వుండటం జరుగుతూ వుంటుంది. కొన్ని క్షేత్రాల్లో శివకేశవుల ఆలయాలు ఒకే ప్రాంగణం కొలువుదీరి వుండగా, మరికొన్ని క్షేత్రాల్లో వేరు వేరు ప్రాంగణాల్లో హరిహరుల ఆలయాలు దర్శనమిస్తూ వుంటాయి. అలా కాకుండా కొండమీద ఒకరు ... కొండకింద ఒకరు ఆవిర్భవించిన అరుదైన క్షేత్రంగా మనకి 'వెన్నవరం' కనిపిస్తుంది.

వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఒకప్పుడు ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండటం వలన జన సంచారం తక్కువగా ఉండేదట. అలాంటి రోజుల్లో ఒక భక్తుడికి శివకేశవులు స్వప్నంలో కనిపించి, తాము కొలువైన కొండ ఆనవాళ్లను చెప్పారు. ఆలయాలు నిర్మించి పూజాభిషేకాలు జరిపించమని ఆదేశించారు. ఆ భక్తుడు చేసిన ప్రయత్నం కారణంగా ఈ కొండ ... ఇక్కడ కొలువైన శివకేశవులు వెలుగులోకి వచ్చారు.

ఇక్కడ కొండపై శివుడు దర్శనమిస్తూ వుండగా, కొండ దిగువున వేంకటేశ్వరస్వామి పూజలు అందుకుంటూ వుంటాడు. శివకేశవులు ఇద్దరూ స్వయంభువులు కావడం ఇక్కడ కనిపించే ఒక విశేషమైతే, ఆ ఇద్దరికీ మధ్య ... అంటే కొండ మధ్య భాగంలో కోనేరు వుండటం మరో విశేషంగా చెబుతుంటారు. కొండపై గల శివుడి అభిషేకానికీ ... కొండకింద గల వేంకటేశ్వర స్వామి అభిషేకానికి ఈ కోనేటి నీళ్లు వాడుతూ వుంటారు.

చూసిన వాళ్లు రెండు ఆలయాలకి అందుబాటులో ఉండేలా ఈ కోనేరును నిర్మించారని అనుకుంటారు. కానీ ఈ కోనేరును ఎవరూ నిర్మించలేదు ... సహజసిద్ధంగా ఏర్పడింది కావడం వల్లనే ఇది మరింత విశిష్టతను సంతరించుకుంది. శివకేశవుల పాదముద్రల నుంచి ఈ కోనేరు ఆవిర్భవించిందని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా పాదముద్రలు ఇక్కడ దర్శనమిస్తూ వుంటాయి.

ఈ కోనేరు మహిమాన్వితమైనదనీ, మనసులోని కోరిక చెప్పుకుంటూ ఇందులోని నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అవి తప్పక నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. అందుకు నిదర్శనంగా తమ అనుభవాలను ఆవిష్కరిస్తూ వుంటారు. నిజానికి కొన్ని క్షేత్రాలను చూడగానే అవి మహిమాన్వితమైనవనే విషయం బోధపడుతుంటుంది. అలాంటి క్షేత్రాల వరుసన ఈ క్షేత్రం కూడా నిలుస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.


More Bhakti News