దీర్ఘకాలిక వ్యాధిని దూరం చేసిన స్వామి

శిరిడీసాయిబాబా ...అక్కల్ కోటస్వామి మాదిరిగానే మాణిక్యప్రభువుల వారి జీవితం కూడా అనేక మహిమలకు వేదికగా కనిపిస్తూ వుంటుంది. ఆయా సందర్భాలను బట్టి వాళ్లు చూపిన మహిమలు కూడా ఒకేలా అనిపిస్తూ వుంటాయి. అలాంటి మహిమలను గురించి తెలుసుకున్నప్పుడు, రూపాలు ... నామాలు వేరైనా వాళ్లంతా ఒక్కటేననే భావం కలుగుతుంటుంది.

ఒకసారి మాణిక్యప్రభువుల వారు తన శిష్యబృందంతో కలిసి, వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ఓ గ్రామానికి చేరుకుంటారు. ఆ సమయంలోనే ఓ వ్యక్తి ఆయనని సమీపించి, కడుపునొప్పితో తాను దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్టుగా చెబుతాడు. ఎంతోమంది వైద్యులకు చూపించినా వ్యాధి ఏమిటనేది ఎవరికీ అంతుబట్టలేదని అంటాడు. మరణమే శరణ్యమని తాను అనుకుంటోన్న సమయంలో, ఆయన దర్శనభాగ్యం లభించిందని చెబుతాడు. తనని ఈ బాధ నుంచి బయట పడేయవలసిందిగా కన్నీళ్లతో వేడుకుంటాడు.

ఔషధంగా ఆయన తీసుకోవలసిన ఆహారం గురించి మాణిక్య ప్రభువులవారు చెబుతారు. ఆయన మాటలు విన్న అక్కడివాళ్లు నివ్వెరపోతారు ... ఎందుకంటే ఆ వ్యాధి గల వాళ్లు ఆ ఆహార పదార్థాలను స్వీకరిస్తే మరింత ప్రాణాల మీదకి వస్తుంది. అదే విషయాన్ని వాళ్లు వ్యక్తం చేసినా భయపడకుండా, మాణిక్య ప్రభువుల మాట పట్ల విశ్వాసంతో ఆ వ్యక్తి ఆయన చెప్పినట్టిగానే చేస్తాడు. దాంతో అనతికాలంలోనే ఆయన వ్యాధి పూర్తిగా తగ్గుతుంది. ప్రభులవారిని ఆయన సంతోషంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతాడు. ఏ వ్యాధికైనా విశ్వాసానికి మించిన విరుగుడు లేదని చెప్పిన ప్రభువులవారు, ఆ వ్యక్తిని ఆశీర్వదించి పంపిస్తారు.


More Bhakti News