అడిగిన వరాలనిచ్చే ఆదిదేవుడు

ఆదిదేవుడికి అమ్మలాంటి మనసుందని ఆయన భక్తులు భావిస్తుంటారు. పిలవగానే పరిగెత్తుకు వచ్చి, అడగ్గానే వరాలను ప్రసాదించడమే ఇందుకు కారణం. అలాంటి పరమశివుడుని కాకతీయులు ఎంతగానో ఆరాధించారు ... అనేక ప్రాంతాల్లో ఆయన ఆలయాలు నిర్మించారు. తమకి పూర్వమే గల శివాలయాల అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. అవన్నీ కూడా నేడు పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి.

అలాంటి విశిష్టమైన శైవ క్షేత్రాలలో ఒకటిగా 'కొండపాక' వెలుగొందుతోంది. మెదక్ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో 'రుద్రేశ్వరుడు'గా స్వామి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. కాకతీయులు శివలింగాలను ... పానవట్టాలను రూపొందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శివలింగం నున్నగా ... నిండుగా ... కాస్త భారీగా చక్కని ఆకృతిని కలిగి వుంటుంది. ఇక పానవట్టం విశాలంగా చతురస్రాకారంలో కనిపిస్తుంది.

ఈ ప్రత్యేకత కారణంగా చూడగానే ఆ శివలింగం కాకతీయుల కాలం నాటిదని తెలిసిపోతూ వుంటుంది. రుద్రేశ్వర లింగాన్ని దర్శించినప్పుడు కూడా అదే అనుభూతి కలుగుతుంది. కాకతీయ రుద్రదేవుడి పాలనా కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం నాటి నుంచి తన విశిష్టతను చాటుకుంటూనే వుంది. ఈ స్వామి అనుగ్రహం కారణంగానే తమ జీవితం సుఖసంతోషాలతో కొనసాగుతోందని స్థానికులు విశ్వసిస్తూ వుంటారు. తమ పంటలను ... పశువులను ఆయనే సంరక్షిస్తూ ఉంటాడని భావిస్తుంటారు.

విశేషమైన పర్వదినాల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్త జనులు తరలివస్తారు. మంచులాంటి మనసున్న మహాదేవుడికి ఘనంగా ఉత్సవాలు జరుపుతూ ... మొక్కుబడులు చెల్లిస్తూ ఆ స్వామిపట్ల తమకి గల కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటూ వుంటారు. స్వామి దర్శనభాగ్యం వలన సకలశుభాలు చేకూరతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News