ఇలా వేడుకుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు

ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్లు ఇంట్లోని పూజా మందిరాలలో నిత్య దీపారాధనలు చేస్త్తుంటారు. పర్వదినాల్లో ఆలయాలకి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు. ఇక ఏ మాత్రం కాస్త సమయం దొరికినా పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు. అయితే కొంతమంది భగవంతుడి ఎదురుగా ఉన్నంత సేపు తమ మనసులోని కోరికలను ఓ జాబితాగా చెప్పేస్తుంటారు.

తనకి పదోన్నతి లభించాలనీ ... భార్య పేరున తాను కడుతోన్న ఇల్లు త్వరగా పూర్తికావాలనీ ... తన కుమారుడికి మంచి ఉద్యోగం రావాలనీ ... తన కూతురికి మంచి సంబంధం రావాలని స్వామివారిని కోరుతూ వెళుతుంటారు. తన వెనుక భక్తుల రద్దీ ఎంతగా వున్నా ఇలాంటి వాళ్లు ఒకపట్టాన దేవుడిముందు నుంచి కదలరు. స్వామివారు వినిపించుకున్నారో లేదోనన్నట్టుగా చెప్పిందే చెబుతుంటారు.

ఆపదల్లో ... అత్యవసరాల్లో భగవంతుడుని వేడుకోవడం వేరు. జీవితంలో కష్టమనేది కలగకుండా సుఖాలకి ఆటంకం రాకుండా ఉండటం కోసం దైవాన్ని ఆశ్రయించడం వేరు. రెండో కేటగిరికి చెందిన వాళ్లు, భగవంతుడంటే కోరికలను నెరవేర్చే సాధనంగా భావిస్తున్నట్టు తెలిసిపోతుంటుంది. భగవంతుడు కూడా ఇలాంటి మొరలను ఆలకించడు ... ఆయన దృష్టిలో అంతా సమానమే.

చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్టుగా తాము చేసిన పాపపుణ్యాలను బట్టే ఫలితం వుంటుంది. ఇందులో భాగంగానే కష్టసుఖాలు కలిసి పలకరిస్తుంటాయి. అందువలన సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదించమని భగవంతుడిని కోరడం సరైనది కాదు. కష్టాలను ఎదుర్కునే శక్తిని ప్రసాదించమని మాత్రమే కోరుకోవాలి ... తనకి అండగా ఉండమని వేడుకోవాలి. ఇలాంటి ప్రార్దనే భగవంతుడి మనసును ఆకట్టుకోగలుగుతుంది ... ఆయన అభయాన్ని అందించగలుగుతుంది.


More Bhakti News