ఇక్కడి వినాయకుడు ఇలా వెలుగు చూశాడు

శుభాలను ... లాభాలను ... వీలైనన్ని విజయాలను అందించడంలో వినాయకుడు ముందుంటాడు. ఈ కారణంగానే అందరూ ఆయనకి తొలి ప్రాధాన్యతను ఇస్తుంటారు. వినాయకుడి పట్ల గల విశ్వాసం వల్లనే ఆయన ఆవిర్భవించిన వివిధ క్షేత్రాలు, అనునిత్యం భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో స్వామివారు ఆవిర్భవించిన విషయానికి సంబంధించి, ఒక్కో క్షేత్రంలో ఒక్కో ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది.

అలాగే బెంగుళూరు - బుల్ టెంపుల్ రోడ్ లో గల 'దొడ్డగణపతి' ఆలయ నిర్మాణం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది. బెంగుళూరు స్థాపనలో కీలకమైన పాత్రను పోషించిన 'కెంపెగౌడ' ... ఒకసారి తన పరివారంతో కలిసి వేటకు వెళతాడు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఉండగా, ఆయన దృష్టి ఒక కొండపై పడుతుంది. ఆ కొండపై గల ఒక పెద్ద బండరాయి వినాయకుడి ఆకృతిని కలిగి ఉండటం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

తనకి మాత్రమే అలా అనిపిస్తుందా ... మిగతా వాళ్లకి కూడా అలాగే కనిపిస్తుందా ? అనే సందేహంతో ఆయన తన పరివారానికి ఆ విషయం చెబుతాడు. ఆ కొండరాయి తమకి కూడా గణపతి రూపంలా కనిపిస్తుందని వాళ్లు అనడంతో, ఆ క్షణమే ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ శిలపై అక్కడక్కడా కాస్త 'ఉలి'కి పనిచెబితే చాలు, భారీ వినాయకుడు వెలుగుచూస్తాడని అనుకుంటాడు. ఆలస్యం చేయకుండా తన ఆలోచనను ఆచరణలో పెడతాడు. ఫలితంగా 18 అడుగుల ఎత్తు ... 16 అడుగుల వెడల్పుతో గణపతిమూర్తి ఆవిష్కృతమవుతుంది.

ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఈ ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ వుంటుంది. ఒక కొండరాయి వినాయకుడి ఆకారాన్ని కలిగివుండటం ... అది పడాల్సిన వాళ్ల కంట్లో పడి పరిపూర్ణమైన రూపాన్ని సంతరించుకోవడాన్ని బట్టి, ఇది మహిమాన్వితమైన సంఘటనగా భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ప్రత్యేకమైన సేవలతో ఆయన పట్ల గల ప్రేమానురాగాలను చాటుకుంటూవుంటారు.


More Bhakti News