ఇవి శుభశకునాలుగా భావించవచ్చు

ఏదైనా ఒక ముఖ్యమైన పనిమీద బయటికి వెళుతున్నప్పుడు ... శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు మంచి శకునం చూసుకోవడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది. శకునం మంచిది కాకపోతే ఆ పనికి సంబంధించిన ప్రయత్నాలు విరమించుకునే వాళ్లు ... నిర్ణయాలు మానుకునే వాళ్లు ఎంతోమంది వున్నారు. శకునం మంచిదైతే వెళ్లే పని విజయవంతమవుతుందనీ, లేదంటే ఆ కార్యానికి అనేక ఆటంకాలు కలుగుతాయని అంతా బలంగా విశ్వసిస్తుంటారు.

ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు ... జంతువులు ఎదురుకావడం, కొన్ని శబ్దాలు వినిపించడం శుభసూచనగా పరిగణిస్తుంటారు. మంచి శకునం చూసుకుని బయలుదేరదామని ఎదురుచూస్తూ కూర్చునే వాళ్లు ... గుడిలో గంట మోగిన శబ్దం వినిపిస్తే బయలుదేరవచ్చు. అలాగే ఎక్కడి నుంచైనా మంగళ వాయిద్యాలు వినిపించినా ... మంగళ వాయిద్య బృందం ఎదురుపడినా ఎలాంటి సందేహం లేకుండా ప్రయాణం కట్టవచ్చు.

ముత్తయిదువులు ఏదైనా పేరంటానికి వెళుతూగానీ, పూలు - పండ్లు ... బిందెతో నీళ్లు తెస్తూ గాని ఎదురుపడితే, అది అన్ని రకాలుగా శుభ సూచకంగా భావించి బయలుదేరవచ్చు. ఇక జంతువులలో ఏవి ఎదురొస్తే మంచి శకునంగా భావించాలనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. ఆవులు ... గుర్రాలు ఎదురువస్తే శుభప్రదంగా భావించి తక్షణమే బయలుదేరవచ్చు. ఇలా మంచివిగా చెప్పబడుతోన్న ఈ శకునాలను చూసుకుని బయలుదేరడం వలన, తలపెట్టిన కార్యాలు జయప్రదమవుతాయని చెప్పవచ్చు.


More Bhakti News