పూజ కోసం ఇలా పూలు కోయకూడదు

పూజ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది పూలే. భగవంతుడిని వివిధ రకాల పూలతో పూజించినప్పుడే సంతోషం కలుగుతుంది ... సంతృప్తి మిగులుతుంది. భగవంతుడు ఎంతటి విలువైన వస్త్రాలను ధరించినా ... అమూల్యమైన ఆభరణాలు ధరించినా, పూలతో చేసే అలంకారం వలన ఆయనకి వచ్చే అందం వేరు ... అవి భక్తులకు పంచే అనుభూతి వేరు.

ఇలా భగవంతుడిని అలంకరించడంలోను ... అర్చించడంలోను పూలు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటాయి. అంతటి విశిష్టతను సంతరించుకున్న పూలను కోయడంలో భక్తులు కూడా అనుభూతి చెందుతూ వుంటారు. భగవంతుడికి సమర్పించే పూలను కోయడంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

ఉదయాన్నే స్నానం చేసిన తరువాతనే పూలచెట్టును తాకవలసి వుంటుంది. స్నానం చేశాం కదా అని తడిబట్టలతో పూలు కోయకూడదు. తడి బట్టలతో కోసిన పూలను భగవంతుడు స్వీకరించడని శాస్త్రం చెబుతోంది. భగవంతుడి పూజ కోసం అన్నట్టుగా మనసులో చెప్పుకుని, పూల చెట్టుకి నమస్కరించి పూలను కోయాలి ... అలాగని పూలు మొత్తం కోయకూడదు.

ఒక్క పువ్వు కూడా చెట్టుకి లేకుండా కోయడం వలన పుణ్యానికి బదులుగా దోషం కలుగుతుందని గ్రహించాలి. పూలు చేతికి అందకపోతే కొమ్మను కర్రతో కొట్టకూడదు ... అలా కిందపడిన పూలను సేకరించకూడదు. ఇక చెట్టు నుంచి కోసిన పూలను నేరుగా నేలపై పెట్టకుండా భగవంతుడికి సమర్పించవలసి వుంటుంది. పూలను సమర్పించే విషయంలో ఈ విధమైన నియమాలను పాటిస్తూ పూజించడం వలన దోష రహితమైన ఫలితాలను పొందవచ్చు.


More Bhakti News