దీపం వెలుగులోనే దైవాన్ని దర్శించాలా ?

సాధారణంగా మారుమూల ప్రాంతాలలోనున్న ఓ మాదిరి ఆలయాలు ముఖమంటపం ... అంతరాళం ... గర్భాలయం కలిగి కనిపిస్తుంటాయి. అందువలన భక్తులు ముఖమంటపంలో నుంచుని గర్భాలయంలో గల దైవాన్ని దర్శించుకుంటూ వుంటారు. దైవం దగ్గరగా ... స్పష్టంగా కనిపించడం వలన భక్తులు సంతృప్తి చెందుతారు.

ఇక ప్రాచీనకాలం నాటి ఆలయాలు ... ముఖ్యంగా భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చే క్షేత్రాలకు వెళ్లినప్పుడు దైవదర్శనం కాస్త ఇబ్బందిగా మారుతుంది. స్వామివారి గర్భాలయానికీ ... భక్తులు దర్శనార్థం నుంచునే ప్రదేశానికి మధ్య ద్వారాలు ఎక్కువగా వుంటాయి. అందువలన భగవంతుడిని కాస్త దూరం నుంచే భక్తులు దర్శించుకోవలసి వస్తుంది. ఇక గర్భాలయంలో గల స్వామిని దీపారాధన వెలుగులో మాత్రమే చూడవలసి వస్తుంది. లోపల విద్యుత్ దీపాలుపెడితే బాగుండేదనీ, దర్శనం బాగా అయ్యేదని కొంతమంది అనుకుంటూ వుంటారు.

నిజానికి ఆగమశాస్త్రం ప్రకారమే భగవంతుడిని అలా దీపం వెలుగులో దర్శింపజేస్తారు. దీపం వెలుగులో ఉన్నప్పుడే, భక్తులు మరింత శ్రద్ధగా దృష్టిని కేంద్రీకరించి భగవంతుడి రూపాన్ని చూడటానికి ప్రయత్నిస్తారు. స్వామివారి కిరీటం .. ముఖము .. శంఖు చక్రాలు .. వక్షస్థలం .. భుజాలు .. కర్ణాభరణాలు .. హృదయాభరణాలు .. అభయ వరద హస్తాలు .. పాదాలు .. ఇలా ఒక్కొక్కటిగా కళ్లతో తడుముతూ ఆ సమ్మోహన రూపాన్ని దర్శించి ముగ్ధులవుతారు.

స్వామివారికి హారతి ఇవ్వడంలో కూడా ఆయన దివ్యమంగళ రూపం భక్తులకు స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశమే ప్రధానంగా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలోని దీపం ... భగవంతుడు జ్యోతి స్వరూపుడు అనే విషయాన్ని గుర్తుచేస్తూ వుంటుంది. దీపం జ్ఞానానికి ప్రతీక ... అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే వెలుగుతో పారద్రోలినప్పుడే భగవంతుడిని చూడగలమనే పరమార్థాన్ని అది బోధిస్తూ వుంటుంది.


More Bhakti News