హనుమంతుడు ఇలా ప్రసన్నుడవుతాడట !

దుష్టశక్తుల బారినపడిన వాళ్లని కుటుంబసభ్యులు వెంటబెట్టుకుని హనుమంతుడి ఆలయాలకి తీసుకువెళుతూ వుంటారు. హనుమంతుడు శివాంశ సంభూతుడు కనుక, దుష్టశక్తులు ఆయన కనుచూపుమేరలో కాలుపెట్టడానికి భయపడతాయి. ఇక గ్రహపీడల కారణంగా నానాఇబ్బందులు పడుతున్నవాళ్లు కూడా హనుమంతుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆయన ఆలయాలచుట్టూ తిరుగుతుంటారు. సూర్యుడితో హనుమంతుడికి గల అనుబంధం వలన, తమ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తుంటారు.

ఇక హనుమంతుడి భక్తుల జోలికి రానని శనిదేవుడు చెప్పడం వలన, శనిగ్రహ సంబంధమైన దోషాలతో బాధపడుతోన్నవాళ్లు హనుమంతుడిని ఆశ్రయిస్తుంటారు. ఇలా పసిపిల్లల నుంచి పెద్దల వరకూ హనుమంతుడు అందరికీ అభయాన్నిస్తూ ... అనుగ్రహిస్తూ వుంటాడు. ఇలా హనుమంతుడు ఎన్నో విధాలుగా తన భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు.

సాధారణంగా హనుమంతుడు ఆకుపూజలను ... వడ మాలలను ఎక్కువగా ఇష్టపడతాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయా గండాల నుంచి గట్టెక్కినందుకు మొక్కుబడిగా స్వామివారికి ఇవి సమర్పిస్తూ వుంటారు. ఇక మనసులోని కోరికలు నెరవేరాలనుకునే వాళ్లు హనుమంతుడిని 'గులాబీ పూల'తో పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ప్రతినిత్యం తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరంలో హనుమంతుడి చిత్రపటాన్నిగానీ .. ప్రతిమను గాని ఏర్పాటు చేసుకోవాలి. ఇన్ని రోజులపాటు ఆయనని ప్రత్యేకంగా ఆరాధించాలనే నియమం పెట్టుకుని ప్రతినిత్యం గులాబీ పూలతో అర్చించాలి. అచెంచలమైన భక్తి విశ్వాసాలనే నియమంగా కలిగి ఈ విధంగా స్వామివారిని సేవించినట్టయితే, అనతికాలంలోనే ఆశించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News