ఉదయాన్నే నిద్రలేవకపోతే ఫలితం ?

పురాణాలను పరిశీలించినట్టయితే ఆనాటి మహర్షులు ... మహారాజులు బ్రాహ్మీ ముహూర్తంలోనే దైవారాధన కార్యక్రమాన్ని పూర్తిచేసేవాళ్లు. తెల్లవారుజామునే స్నానం చేసి ప్రశాంతమైన మనసుతో భగవంతుడిని పూజించడం వలన, ఇటు ఆరోగ్యపరంగా ... అటు ఆధ్యాత్మికపరంగాను ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్న ఆనాటి ప్రజలు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. ఉదయాన్నే నిద్రలేవడమనేది ఒక ఆచారంగా పాటిస్తూ వచ్చారు.

అయితే కాలక్రమంలో నిద్రమేల్కోవడమనేది ఆచారాల జాబితాలో నుంచి తప్పుకుంది. ఫలానా సమయానికి నిద్రపోవాలి ... ఫలానా సమయానికల్లా మేల్కోవాలనే నియమం ఎక్కడా కనిపించకుండా పోయింది ... ఎవరిష్టం వాళ్లదే. అల్పాహారం తీసుకునే సమయానికి నిద్రలేచేవాళ్లు పల్లెల్లో ఉన్నట్టుగానే, మధ్యాహ్నం భోజన సమయానికి నిద్రలేచే వాళ్లు పట్నంలోను కనిపిస్తుంటారు.

ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వలన, ఉదయాన్నే మేల్కోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకి పెద్దలు చెప్పే అవకాశం లేకుండా పోయింది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, పూజా మందిరాన్ని అలంకరించి దైవాన్ని సేవించాలి. అలాంటివారి ఇంట్లోనే ధనలక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవని వారి ఇంట్లోను ... మధ్యాహ్నం - సాయంత్రం వేళల్లో నిద్రపోయే వారి ఇళ్లలోను లక్ష్మీదేవి ఉండకుండా వెళ్లిపోతుంది.

ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతుందో, అప్పుడు దారిద్ర్యం చుట్టుముడుతుంది. దారిద్ర్యం అనారోగ్యానికి గురిచేసి అనేక కష్టాలకు ఆహ్వానం పలుకుతుంది. అందువల్లనే మన పూర్వీకులు అందరినీ ఉదయాన్నే నిద్రలేపేవాళ్లు ... వేళగాని వేళలో నిద్రపోనిచ్చేవాళ్లు కాదు. ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో తమ ఆడపిల్లలను ... కోడళ్లను ఉదయాన్నే నిద్ర లేపడంలోని ఆంతర్యం ఇదే. తెల్లవారు జామున నిద్రలేవడంపైనే సంపదలు ... సంతోషాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్నిఎప్పటికీ మరచిపోకూడదు.


More Bhakti News