సంతోష సౌభాగ్యాలను అందించే అమ్మవారు

సర్వమంగళగా భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటోన్న ఆదిపరాశక్తి, వివిధ రూపాల్లో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించింది. అమ్మవారి అవతారాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి ఎంతో ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.

కన్నతల్లి కన్నా తొందరగా కరుణించే ఈ అమ్మవారి అనుగ్రహం కోసం ఎంతోమంది మహర్షులు తపస్సు చేశారు. మరెంతో మంది మహారాజులు ఈ అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావించి అనుదినం అర్చించారు. అ తల్లి ఆశీస్సులతో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. అలా అడిగిన వెంటనే వరాలను ప్రసాదించే రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయం మనకి కర్ణాటక ప్రాంతానికి చెందిన 'పోళాలి'లో దర్శనమిస్తుంది.

సువిశాలమైన ప్రదేశంలో సుందరంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం, ఆనాటి నిర్మాణ శైలిని అందంగా ఆవిష్కరిస్తూ వుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయం, మరపురాని మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. గర్భాలయంలో అమ్మవారు 12 అడుగుల ఎత్తును కలిగి, కూర్చుని దర్శనమిస్తూ ఉండటం ఇక్కడి విశేషం. అమ్మవారి చేతి వ్రేళ్లు అతుక్కుని కాకుండా, విడివిడిగా నాజూకుగా చెక్కబడి వుండటం ఇక్కడి ప్రత్యేకత.

సహజంగానే ఈ అమ్మవారిని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేయిస్తూ ... ఆ తల్లికి చీర సారెలు సమర్పిస్తూ వుంటారు. ఉత్సవాల్లో ... ఊరేగింపులలో భారీ సంఖ్యలో పాల్గొని ఆనందాన్ని కలిగిస్తుంటారు. ఈ విధంగా అమ్మవారిని సంతృప్తి పరచడం వలన ఆ తల్లి సంతోష సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తూ వుంటారు.


More Bhakti News