ఇక్కడంతా కాలభైరవుడే చూసుకుంటాడు

కాలభైరవుడు అనే పేరే ఎంతో శక్తిమంతమైనదిగా అనిపిస్తుంది. ఇక ఆయన రూపం బెరుకుని కలిగించేదిగా కనిపిస్తుంది. అయితే శివ భక్తుల విషయంలో ఆయన కరుణాకటాక్షాలను కలిగివుంటాడని చెబుతుంటారు. సాధారణంగా విష్ణు క్షేత్రాలకి శివుడు ... శైవ క్షేత్రాలకి విష్ణువు పరిపాలకులుగా వ్యవహరిస్తూ కనిపిస్తుంటారు. ఇక చాళుక్యులు తమ పరిపాలనా కాలంలో శైవ సంబంధిత క్షేత్రాల్లో, పాలకుడిగా కాలభైరవుడిని ప్రతిష్ఠిస్తూ వచ్చారు.

అందువలన వారి పరిపాలనాకాలంలో నిర్మించబడిన ... పునరుద్ధరించబడిన ఆలయాలలో భైరవుడు దర్శనమిస్తూ వుంటాడు. ఈ నేపథ్యంలో ఆయా క్షేత్రాలను బట్టి 'అష్ట భైరవులు' తారసపడుతుంటారు. భైరవుడు ప్రధానపాత్రను పోషించే శైవక్షేత్రాల్లో ఒకటిగా తూర్పుగోదావరి జిల్లాకి చెందిన 'అయినవిల్లి' కనిపిస్తుంటుంది. కాణిపాకంతో సమానమైన ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కలిగివున్న ఈ క్షేత్రంలో, క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన అనుమతి ... అనుగ్రహం లేకుండా ఈ ప్రదేశంలో ఎవరూ అడుగుపెట్టలేరు.

ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా కాలభైరవుడి దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత ఇతర దేవీదేవతలను దర్శించుకుని, తిరిగి వెళుతూ చివరిగా మరోమారు కాలభైరవుడిని దర్శించుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తోంది. స్వామివారి క్షేత్రంలోకి అడుగుపెట్టే అవకాశం తమకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదటిసారి, త్వరలోనే స్వామి దర్శనం తమకి మరోమారు కల్పించవలసిందిగా కోరుతూ రెండోసారి కాలభైరవుడిని దర్శిస్తూ వుంటారు. వందల సంవత్సరాల చరిత్రను కలిగిన ఈ మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించడం వలన వినాయకుడు విజయాలను ప్రసాదిస్తాడనీ, కాలభైరవుడు కనికరిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News