ఆశ్చర్యచకితులను చేసే మల్లికాగుండం

పూర్వజన్మల పుణ్యఫలాలు వెంటవస్తేనే తప్ప శ్రీశైలం క్షేత్రంలో అడుగుపెట్టడం సాధ్యం కాదు. ఇక్కడి కొండ ... కోన ... చెట్టు ... పుట్ట అన్నీకూడా శివనామస్మరణ చేస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. అదృశ్య రూపంలో ఎంతోమంది దేవతలు ఇక్కడ తిరుగాడుతున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. ఎంతోమంది మహర్షులు ... మునులు ... సిద్ధులు తమ కోసం శివుడు సృష్టించిన గుహల్లో తపస్సు చేసుకుంటున్నారనిపిస్తుంది.

అనేక ఆలయాల సమాహారంగా కనిపించే ఈ క్షేత్రంలో, ప్రతి శిల్పం ...ప్రతి నిర్మాణం అద్భుతంగా ... అపురూపంగా కనువిందు చేస్తుంటాయి. అలాంటివాటిలో 'మల్లికాగుండం' ఒకటిగా కనిపిస్తుంది. శ్రీశైలం వెళ్లిన భక్తులు ఈ మల్లికాగుండాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటూ వుంటారు. మల్లికార్జున ఆలయానికి ఉత్తరం దిశగా గల ఈ మల్లికాగుండంలోని నీటితోనే స్వామివారికి నిత్యాభిషేకాలు నిర్వహిస్తుంటారు.

అంతటి విశిష్టతను కలిగియున్న ఈ గుండం ఓ బావి మాదిరిగా కాకుండా, 16 స్తంభాల మంటపాన్ని పైకప్పుగా కలిగి కనిపిస్తుంది. అంటే దూరం నుంచి చూస్తే మంటపంలాగే అనిపిస్తుంది... దగ్గరికి వెళ్లి చూస్తే ఆ మంటపం మధ్యలో గుండం దర్శనమిస్తుంది. ఇక ఈ గుండం ప్రత్యేకత ఏమిటంటే ... మల్లికార్జునస్వామి ఆలయశిఖరం ఈ గుండంలో గల నీటిలో ప్రతిబింబిస్తూ వుంటుంది.

సాధారణంగా ఆరుబయట ప్రదేశంలో ఉన్న నీటి గుండాల్లో, దగ్గరలో వున్న నిర్మాణాలు ప్రతిబింబించడం సహజం. కానీ ఈ మల్లికాగుండానికి పైకప్పు ఉన్నప్పటికీ, గుండంలో గల నీటిలో స్వామివారి ఆలయశిఖరం ప్రతిబింబించడం విశేషం. ఈ చిత్రాన్ని వీక్షించడానికి పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అరుదైన ఈ విశేషం మల్లికార్జునుడు చేస్తోన్న మాయో ... మంటప నిర్మాణంలో దాగిన మహిమో అర్థంకాక అందరూ సతమతమైపోతుంటారు.


More Bhakti News