తిరుమలలో పాదరక్షలు వాడవచ్చునా ?

ఆధునిక కాలంలో పాదరక్షలు ఉపయోగించనివాళ్లు అరుదుగా ఉంటారనే చెప్పాలి. పాదరక్షలు ఎంతటి విలువైనవే అయినా ... వాటికి ఎన్ని అలంకారాలు వున్నా గుమ్మంముందే విడవడం జరుగుతూ వుంటుంది. సాధారణంగా పాదరక్షలను నడవడానికే ఉపయోగిస్తాం కనుక, సహజంగానే అవి అపవిత్రమవుతూ వుంటాయి. అందువలన వాటిని ఇంట్లోకిగానీ ... ఆలయ ప్రాంగణంలోకిగాని తీసుకువెళ్లరు.

అలాంటిది అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడుతోన్న తిరుమల కొండలపైకి పాదరక్షలు తీసుకుని వెళ్లవచ్చునా అనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. నిజం చెప్పాలంటే, తిరుమల కొండలు ఎక్కడం ఆరంభమయ్యే చోటు నుంచి తిరిగి కిందికి వచ్చేంత వరకూ పాదరక్షల విషయాన్ని మరిచిపోవడమే మంచిది. ఎందుకంటే తిరుమల కొండలు మిగతా కొండలమాదిరిగా మట్టి ... రాళ్ల కలయికతో ఏర్పడినవి కాదు. శ్రీమహావిష్ణువు ఈ ప్రదేశంలో శ్రీనివాసుడుగా కొలువై ఉండటం కోసం, తనకి ఎంతో ఇష్టమైన 'క్రీడాద్రి'ని వైకుంఠం నుంచి తనతో పాటు భూలోకానికి తీసుకువచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి.

ఈ కొండలు ... వాటిపై గల జలాశయాలు ... జీవరాశి అంతా కూడా స్వామివారి కోసం భూలోకానికి తరలించబడినవే. వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఈ క్రీడాద్రిపై విహరించేవాళ్లు. శ్రీమన్నారాయణుడి మనసు దోచుకున్న ఈ పర్వత శ్రేణిని, ఆ స్వామి ఆదేశం మేరకు గరుత్మంతుడు భూలోకానికి తీసుకువచ్చాడు. అందువల్లనే ఏడుకొండలు ఒకదాని తరువాత ఒకటి పేర్చినట్టుగా ... విశాలమైన ఉపరితల భాగాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి.

అలా వైకుంఠం నుంచి వచ్చిన పవిత్రమైన కొండలపై ... పరమాత్ముడు నివాసమేర్పరచుకున్న కొండలపై కాలు మోపడానికి మనకి గల పుణ్య విశేషమెంతటిదో ఆలోచించుకోవాలి. అలాంటిది ఆ కొండలపై పాదరక్షలు ధరించి తిరగడం ఎంత పాపమో అర్థంచేసుకోవాలి. స్వామివారు ఊరేగే ఆలయ మాడవీధుల్లో పాదరక్షలు ఉపయోగించడాన్ని ఆలయ అధికారులు నిషేధించారు. నిజమే జగాలనేలే ఆ తండ్రి ఉత్సాహంగా ఊరేగే ప్రదేశం పవిత్రంగా ఉండటం కోసం ప్రతిఒక్కరూ ఈ నిబంధనను పాటించి తీరాలి.

ఒక్క మాడవీధులలోనే కాదు ... కొండపై ఎక్కడా పాదరక్షలు ఉపయోగించకూడదని ఎవరికి వారు ఒక నియమంగా పెట్టుకోవాలి. సమస్త పాపాలను వదిలించుకోవడానికి వచ్చినప్పుడు, కాసేపు పాదరక్షలను వదిలించుకోలేమా ? అని ప్రశ్నించుకుంటే సరిపోతుంది. ఈ కొండల మార్గంలో గానీ ... కొండపైగాని పాదరక్షలు ఉపయోగించకుండా ఉంటే, స్వామివారి దర్శనం వలన కలిగే పుణ్యం రెట్టింపుగా లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News