వివాహం విషయంలో ఆటంకాలు తొలగాలంటే?

అమ్మాయి విషయంలోనైనా ... అబ్బాయి విషయంలోనైనా వివాహమనేది వారి జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పుతుంది. అందువలన రెండు కుటుంబాల వాళ్లు వివాహానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటారు. భవిష్యత్తుని ప్రభావితంచేసే వివాహం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు.

ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న వివాహం, కొంతమంది విషయంలో ఆలస్యమవుతూ వుంటుంది. ఏ కారణంగానో సంబంధాలు కుదరడంలేదని గ్రహించేసరికి మరింత ఆలస్యమవుతూ వుంటుంది. తాము పెళ్లి చూపులు చూసిన వాళ్లందరికీ వివాహాలు జరిగిపోతున్నాయని తెలిసినప్పుడు అమ్మాయైనా ... అబ్బాయైనా కాస్త కలవరపాటుకి గురికావడం జరుగుతూ వుంటుంది.

వాళ్లు మానసికంగా కుంగిపోతున్నారని గ్రహించిన తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళనకి లోనవుతారు. పిల్లలను వెంటబెట్టుకుని వివిధ క్షేత్రాలకి తిరుగుతుంటారు. ఏ దోషం వాళ్ల వివాహానికి అడ్డుపడుతుందో తెలుసుకుని, దాని నివారణకి తగిన ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వివాహం విషయంలో ఆలస్యం కాకుండా, తలపెట్టిన కార్యం వెంటనే జరిగిపోవాలంటే సుబ్రహ్మణ్యస్వామిని దర్శించాలని శాస్త్రం చెబుతోంది.

ప్రసిద్ధిచెందిన సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలు అనేక ప్రదేశాల్లో అలరారుతున్నాయి. వివాహం ఆలస్యమవుతోన్న అమ్మాయినిగానీ ... అబ్బాయినిగాని వెంటబెట్టుకుని తల్లిదండ్రులు దగ్గరలో గల క్షేత్రానికి వెళ్లాలి. త్వరగా వివాహం జరగేలా చూడమని సుబ్రహ్మణ్యస్వామిని కోరుకుని, ఎవరికైతే వివాహం ఆలస్యమవుతుందో వారిచేత బ్రాహ్మణులకు 'కందులు' దానంగా ఇప్పించాలి. ఈ విధంగా చేయడం వలన వివాహానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోయి, ఆలస్యం కాకుండా వెంటనే వివాహం జరిగిపోతుంది.


More Bhakti News