రుణ విముక్తులను చేసే పారాయణం

ఆధునిక కాలంలో ఆకలి లేనివాళ్లు కనిపిస్తారేమోగానీ, అప్పులు లేనివాళ్లు మాత్రం కనిపించరు. జీవిత ప్రయాణంలో ఎవరైనా సరే అవసరాల నుంచి ఆపదల నుంచి తప్పించుకోలేరు. ఆర్ధికపరిస్థితి సరిగ్గా లేనప్పుడు చిన్నకష్టం వచ్చినా అప్పు చేయవలసి వస్తుంది. ఇక ఆర్ధిక పరిస్థితి బాగానే వున్నా, వచ్చిన ఆపద ఆ స్థాయిని దాటిపోతే వాళ్లు కూడా అప్పుచేయక తప్పని పరిస్థితి ఎదురవుతుంది.

అనుకోకుండా వచ్చి మీదపడే ఆపదల సంగతి అటుంచితే, పిల్లల చదువులకు ... వివాహాలకు అయ్యే ఖర్చులు తల్లిదండ్రులకు భూతద్దంలో కనిపిస్తూ వుంటాయి. తమలా తమ పిల్లలు కష్టపడకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటారు. అందుకోసం తమ స్తోమతను దాటిన ఖర్చుకు సిద్ధపడి అప్పులు చేస్తుంటారు. అవసరం ఏ రూపంలో వచ్చినా, అప్పు చేస్తున్నప్పుడు బాగానే వుంటుంది. ఆ అవసరం కాస్తా తీరిన తరువాత అప్పుతీర్చడం ఎంత కష్టమో తెలుస్తుంది.

గండం గట్టెక్కడం కోసం అప్పు దొరికే వరకూ పడిన మానసిక వత్తిడి, అప్పును తీర్చే సమయంలోను పడవలసి వస్తుంది. సమాజంలో సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ఠలను వేగంగా దెబ్బతీయ గల శక్తి ఒక్క అప్పుకు మాత్రమే ఉంటుంది. అందువలన పరువుకు భయపడి సాధ్యమైనంత త్వరగా అప్పు తీర్చేయాలనే అందరూ ప్రయత్నిస్తుంటారు. అలాంటివారికి ఆధ్యాత్మిక గ్రంధాలు కూడా కొన్ని పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయి. అప్పులు తీర్చడానికి కావసినది మెరుగైన ఆదాయ మార్గాలు కాబట్టి, అందుకోసం 'గజేంద్ర మోక్షం' పారాయణ చేయాలని చెబుతున్నాయి.

బ్రాహ్మీ ముహూర్తంలో పరిశుద్ధులై శ్రీమహావిష్ణువును సేవించి 'గజేంద్ర మోక్షం' చదువుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. ఈ విధంగా ప్రతినిత్యం చేయడం వలన, అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా గజేంద్ర మోక్షం పారాయణం, కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలగనీయకుండా కాపాడుతుంది. అందువలన అప్పుల బాధలు పడుతోన్న వాళ్లు 'గజేంద్ర మోక్షం' పారాయణం తప్పకుండా చేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆశించిన ఫలితాలు అందుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News