భక్తుడి రాకకోసం ద్వారాలు తెరచిన దేవుడు !

నిజమైన భక్తులు భగవంతుడిని చూడాలని ఎంతగా ఆరాటపడుతూ ఉంటారో, అలాంటి భక్తులను అనుగ్రహించే సమయం కోసం ఆ దేవుడు కూడా అంతగానే ఆరాటపడుతూ ఉంటాడు. తన భక్తులు పరీక్షకు నిలిచినప్పుడు, వారిని గెలిపించే బాధ్యతను కూడా ఆ దేవుడే తీసుకుంటాడు. మహాభక్తుల జీవితాలలో జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తూ వుంటాయి.

ఇలాంటి ఒక సంఘటనే కృష్ణ భక్తుడైన 'సూరదాసు' జీవితంలోను చోటుచేసుకుంది. అనూహ్యమైన పరిస్థితులు చుట్టుముట్టడంతో, అంధుడైన సూరదాసు తన గ్రామాన్ని వదిలి బయలుదేరుతాడు. తాను ఏ గమ్యానికి చేరుకోవాలనే విషయాన్ని ఆ పరమాత్ముడే చూసుకుంటాడని ఆయన భావిస్తాడు. సూరదాసు విశ్వాసానికి తగినట్టుగానే, ఓ బాలకుడిగా తారసపడిన శ్రీకృష్ణుడు ఆయనకి ఒక ఆశ్రయాన్ని చూపించి, కావలసినవి ఏర్పాట్లు చేస్తుంటాడు.

కృష్ణుడిపట్ల ఆయనకి గల అసమానమైన భక్తి శ్రద్ధలు అక్కడి వారిని కట్టిపడేస్తాయి. మధురమైన ఆయన గానం అక్కడి ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతూ వుంటుంది. సూరదాసు కీర్తిప్రతిష్ఠలు పెరుగుతూ ఉండటాన్ని సహించలేని కొందరు వ్యతిరేకులు, ఆయన గురించి లేనిపోనివి కల్పించి అక్కడి పెద్దలకు చెబుతారు. కంటి చూపులేకపోయినా మనసుతో ఆ దైవాన్ని చూసేందుకు సూరదాసు ఆలయానికి వెళుతూ ఉండేవాడు.

ఒక రోజున కృష్ణుడి ఆలయానికి వస్తోన్న సూరదాసును ఆలయ అధికారులు గమనిస్తారు. చెప్పుడు మాటల ప్రభావానికి లోనైన వాళ్లు, ప్రధానద్వారం తలుపు మూసేయిస్తారు. సూరదాసును అడ్డుకోవడమే కాకుండా, నిజంగా భక్తి పరుడవైతే మనోనేత్రం ద్వారా కృష్ణదర్శనం చేసుకోమని అంటారు. దాంతో తన మనోనేత్రం ద్వారా ఆలయంలో గల కృష్ణుడి రూపాన్ని గురించి ... ఆయన ధరించిన వస్త్రాలను గురించి ... ఆయనకి జరిగిన అలంకారం గురించి ప్రత్యక్షంగా చూసినట్టుగా పాడతాడు.

ఆలయ సిబ్బంది ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా తలుపులు వాటంతటవే తెరచుకుంటాయి. చెప్పుడు మాటలు విని ఒక మహాభక్తుడిని తాము అవమానపరిచామని తెలుసుకుని వాళ్లంతా ఆయన పాదాలకి నమస్కరిస్తారు. ఆలయ మర్యాదలతో ఆయనను లోపలి తీసుకువెళ్లి, ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు మన్నించమని పదే పదే కృష్ణుడిని వేడుకుంటారు.


More Bhakti News