ఆలయ పవిత్రతను అందరూ కాపాడాలి

పూర్వకాలంనాటి ఆలయాలు సువిశాలమైన ప్రాంగణంతో ... ఎత్తైన రాజగోపురాలతో ... పొడవైన ప్రాకారాలతో కనిపిస్తుంటాయి. ఇక ఆధునిక కాలంలో నిర్మించబడుతోన్న ఆలయాలు కుదురుగా ... ఆకర్షణీయంగా దర్శనమిస్తూ వుంటాయి. సహజంగానే ఆలయాలను అందంగా తీర్చిదిద్దిన తీరు ... శిల్పకళా శోభితంగా మలచిన విధానం భక్తులను మత్రముగ్ధులను చేస్తుంటాయి.

పూర్వం ఆలయాలకి వెళితే, అక్కడి గోడలపై భగవంతుడి నామాలు ... ఆయన భజనలకు సంబంధించిన పంక్తులు మాత్రమే కనపడుతూ ఉండేవి. కానీ ఆధునిక కాలంలో కొన్ని ఆలయాలకి సంబంధించిన గోడలపై ఎన్నో పిచ్చిరాతలు కనిపిస్తుంటాయి. ఇలాంటివి చూసినప్పుడు నిజమైన భక్తులకు నిజంగానే బాధకలుగుతుంది. ఆ రాతలను చెడిపేసి .. మళ్ళీ ఎవరూ అక్కడ ఏమీ రాయకుండా ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచన కలుగుతుంది.

సాధారణంగా మనసునిండా దైవభక్తి వున్న వాళ్లెవరూ దేవాలయ గోడలను పాడుచేయరు. ఆలయం మొత్తాన్ని ఒక పవిత్రమైన ప్రదేశంగా భావించి నమస్కరిస్తుంటారు. విహారానికి అన్నట్టుగా గుడికి వచ్చిన ఆకతాయిలు మాత్రమే ఇలాంటి పనులు చేస్తుంటారు. వీలైతే రంగుతో ... లేదంటే బొగ్గుతో తమ ఇష్టం వచ్చేసినట్టుగా గోడలపై రాసేస్తుంటారు. మరికొందరు తాము చేస్తోన్న ఈ పిచ్చిపని ఎప్పటికీ నిలిచిపోవాలనే ఉద్దేశంతో రాయి తీసుకుని గోడలపై చెక్కుతుంటారు.

నిజానికి వాళ్ల రాతలను బట్టే వాళ్లలో ఇంకా మానసిక పరిపక్వత రాలేదని తెలిసిపోతూ వుంటుంది. అయితే ఆ పని చేయకుండా వాళ్లను ఎవరూ అదుపుచేయలేని పరిస్థితి కనిపిస్తూ వుంటుంది. ఎవరూ చూడకుండానో ... చూసి అడిగిన వారిపై తిరగబడో వాళ్లు చేయదలచుకున్న పని పూర్తి చేస్తుంటారు. పవిత్రమైన ఆలయాల అందాన్ని చెడగొట్టడం ఒక తప్పయితే, ఆ గోడలపై అర్థం పర్థంలేని పిచ్చిరాతలు రాసి భక్తుల మనసుకి కష్టం కలిగించడం మరోతప్పు.

ఆలయాలు అందరివీ ... అక్కడి ప్రశాంతత అందరూ పొందేది. అందువలన అక్కడి పవిత్రతను కాపాడవలసిన బాధ్యత కూడా అందరిపై వుందనే విషయాన్ని గ్రహించాలి. ఆలయ సిబ్బందితో పాటు ... భక్తులు కూడా ఈ విషయంపై కాస్త దృష్టిపెడితే ఇలాంటి ఆకతాయి పనులను నిలువరించవచ్చు ... ఆలయ గోడలను అపవిత్రం చేసే అర్థంపర్థంలేని రాతల నుంచి విముక్తిని కల్పించవచ్చు.


More Bhakti News