విశ్వాసమే విజయాన్ని ప్రసాదిస్తుంది

సాధించవలసిన విషయంపైన సందేహం ఉండకూడదు. పూర్తి విశ్వాసంతో ప్రయత్నించినప్పుడే విజయం వెతుక్కుంటూ వస్తుంది. తమదైన మార్గంలో ప్రయాణిస్తూ ఎంతోమంది మహనీయులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అలాంటి వాళ్లలో 'కనకదాసు'ని ఒకడిగా చెప్పుకోవచ్చు. ఓ సేనాధిపతి కొడుకుగా బాల్యం నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్న కనకదాసుకి ఓ అనుకోని సంఘటన ఎదురవుతుంది. దాంతో ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం దిశగా అడుగులు వేస్తాడు.

ఉన్న ఊరిని వదిలి అలా నడచుకుంటూ వెళుతోన్న కనకదాసుకి ఓ మహర్షి కనిపిస్తాడు. శిష్యులకు వేదపాఠాలు చెబుతోన్న ఆయన దగ్గరికి వెళ్లి, తనని శిష్యుడిగా స్వీకరించి మంత్రోపదేశం చేయవలసిందిగా కోరతాడు. ఆయన ఏకాగ్రతను పరీక్షించాలనుకున్న ఆ మహర్షి, 'దున్నపోతు' నామాన్ని జపించమని చెబుతాడు. కనకదాసు ఆ ఆశ్రమానికి దగ్గరలో గల ఓ మట్టి దిబ్బపై కూర్చుని దున్నపోతు నామాన్ని అదే పనిగా జపించడం మొదలుపెడతాడు.

రోజులు గడిచిపోతున్నా ఆయన శరీరంలో ఎలాంటి కదలిక వుండదు. దున్నపోతు నామాన్ని ఆయన అలా స్మరిస్తూనే ఉండిపోతాడు. అలా కొంతకాలం గడిచాక ఆయన ముందు ఒక దున్నపోతు ప్రత్యక్షమవుతుంది. దాని అరుపుతో ఈ లోకంలోకి వచ్చిన కనకదాసు ఆనందాశ్చర్యాలకి లోనవుతాడు. గురువు మంత్రోపదేశ ఫలితాన్ని ఆయనకి చూపించడం కోసం ఆ దున్నపోతును ఆశ్రమానికి తీసుకువెళతాడు. విషయం తెలుసుకున్న మహర్షి ఆశ్చర్యపోతాడు. కనకదాసు గురుభక్తి ... గురువు చెప్పిన మంత్రం పట్ల ఆయనకి గల విశ్వాసం చూసి ఆ మహర్షి సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. కనకదాసు ఏకాగ్రతను అభినందిస్తూ అక్కున చేర్చుకుంటాడు.

మంత్రోపదేశం ఫలితంగా వచ్చిన దున్నపోతుతో, అందరికీ ఉపయోగపడే పని చేయించాలని వుందని అంటాడు కనకదాసు. అక్కడికి కాస్త దూరంగా వున్న పెద్ద బండరాయిని చూపించి, దానిని అడ్డు తీయించమని చెబుతాడు మహర్షి. ఆ బండరాయి అడ్డుతొలగించడం వలన, ఆ చుట్టుపక్కల గ్రామాలకి అవసరమైన మంచినీరు అందుతుందని అంటాడు. గురువు చెప్పినట్టే కనకదాసు చేయడంతో, ఆశ్రమవాసులతో పాటు ఆ గ్రామస్తులందరూ ఆయనని ఎంతగానో ప్రశంసిస్తారు.


More Bhakti News