నమ్మినవారికి నమ్మినంత ఫలితం

బాబా మశీదులో ఉంటోన్న రోజుల్లో ఆయనకి అత్యంత సన్నిహితంగా కొంతమంది ఉంటూ వుండే వాళ్లు. బాబాకి సేవ చేయడమే భాగ్యంగా భావించి, ఆయనతోనే వాళ్లు ఎక్కువ సమయాన్ని గడుపుతూ వుండేవాళ్లు. బాబా కోపించినా ... ఆటపట్టించినా అందులో ఏదో అర్థం ఉందని భావించి, ఆయనని ఓ దివ్యపురుషుడుగానే వాళ్లు విశ్వసించే వాళ్లు. అలా బాబాను మనస్పూర్తిగా ఆరాధించే వాళ్లలో 'కాశీరామ్' ఒకడు.

బాబాకి తెలియకుండా ఏదీ జరగదు ... ఏం జరిగినా బాబా వున్నాడు అనే ధైర్యంతో కాశీరామ్ ఉండేవాడు. ఒకసారి కాశీరామ్ పొరుగూరులో పనిచూసుకుని తిరుగు ప్రయాణమవుతాడు. అప్పటికే బాగా పొద్దుపోవడంతో వడివడిగా అడుగులు వేయడం మొదలుపెడతాడు. అప్పటికే కాశీరామ్ ని అనుసరిస్తూ వస్తోన్న దొంగలు ఒక్కసారిగా ఆయనని చుట్టుముడతారు.

తన దగ్గరున్న కాస్త సొమ్మును వాళ్లకి సమర్పించుకోవడం ఇష్టంలేక, వాళ్లను ఎదిరించలేక కాశీరామ్ తెల్లముఖం పెడతాడు. బాబానే తనని కాపాడగలడు అనే విశ్వాసంతో కళ్లు మూసుకుని ఆయనని మనసులోనే స్మరించుకుంటాడు. అంతే కళ్లు తెరిచిన ఆయనకి ఎదురుగా బాబా కనిపిస్తాడు. ''భయంలేదు .. దొరికినవాడిని దొరికినట్టుగా కొట్టు ... నేనున్నాను'' అంటూ చెబుతాడు.

అంతే కాశీరామ్ ని ఏదో శక్తి ఆవహించినట్టు అవుతుంది. దాంతో ఆయన ఒక్కసారిగా దొంగాలపై తిరగబడతాడు. ఆయన ధాటికి తట్టుకోలేక దొంగలు కాలికి బుద్ధిచెబుతారు. ఉదయాన్నే శిరిడీకి చేరుకున్న కాశీరామ్ ... తనని కాపాడిన బాబాకి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. రాత్రి జరిగిన సంఘటన గురించి అక్కడి వారికి వివరంగా చెబుతాడు. బాబా ఇచ్చిన ధైర్యమే ... ఆయన అనుగ్రహమే తనని ఆ గండం నుంచి బయటపడేసిందని అంటాడు.

క్రితం రాత్రి మశీదులో వున్న బాబా ... '' భయపడకు ... నేనున్నాను'' అంటూ హఠాత్తుగా ఎందుకంతలా అరిచాడనేది అప్పుడు వారికి అర్థమవుతుంది. మశీదు నుంచే తనని బాబా రక్షించాడని తెలుసుకున్న కాశీరామ్ ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. తన భక్తులు ఎంతదూరంలో వున్నా, ఆపదలో చిక్కుకున్న మరుక్షణమే బాబా అక్కడికి చేరుకుంటాడనీ ... ఆదుకుంటాడని ఈ సంఘటన మరోమారు నిరూపించింది.


More Bhakti News