గుడిలో తప్పనిసరిగా ఈ నియమం పాటించాలి

గుడి అనేది పవిత్రతకు ప్రతిరూపం ... ప్రశాంతతకు ప్రతిబింబం. అలాంటి విశిష్టతను సంతరించుకున్న గుడికి వెళ్లినప్పుడు భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించవలసి వుంటుంది. ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. పూలు - పండ్లు తీసుకుని పద్ధతిగానే గుడికి వచ్చాంగదా ... ఇంకా పాటించవలసిన నియమం ఏముంటుందని కొంతమంది అనుకుంటూ వుంటారు.

పూలు .. పండ్లతో పాటు గుడికి సెల్ ఫోన్ తీసుకెళ్ళే అలవాటు చాలామందిలో కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాల్లో సెల్ ఫోన్ తో ప్రవేశాన్ని నిషేధించారుగానీ, సాధారణ ఆలయాల్లో ఈ నిబంధన కనిపించదు. దాంతో ఈ ఆలయాల్లో పూజ చేయించుకుంటూనే మధ్య మధ్యలో పక్కకి వెళ్లి ఫోన్లో మాట్లాడేవాళ్లు ఎక్కువగానే కనిపిస్తుంటారు.

కొంతమంది గుడికి వచ్చినది మొదలు ... తిరిగి వెళ్ళేంత వరకూ ఫోన్లో మాట్లాడుతూనే వుంటారు. దర్శనం చేసుకోవడం .. తీర్థప్రసాదాలు తీసుకోవడం యాంత్రికంగా కానిచ్చేస్తుంటారు. ఈ రకమైన ధోరణి భగవంతుడిపట్ల నిర్లక్ష్య భావనను తెలుపడమే కాకుండా ఇతరుల ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అందువలన ఇది ఏ రకంగాను ఎవరూ అంగీకరించకూడదనే చెప్పాలి. వందల మందిలో తమ విన్నపాన్ని భగవంతుడికి వినిపించే తీరిక భక్తులకు లేనప్పుడు, కోట్లమందిలో ఆ భక్తుల మొరవినే తీరిక ఆయనకి ఎలా వుంటుంది?.

ఎవరి పనుల్లో ఎవరు ఎంత తీరికలేకుండా వున్నా, భగవంతుడి కన్నా ... ఆయన ఆరాధన కన్నా ముఖ్యమైన విషయం ఏముంటుంది? నడిపించేదే ఆయన అయినప్పుడు ... ఆయనని వదిలేసి పరుగులు తీయడం ఎందుకు ? గుడికి వచ్చేదే ప్రశాంతత కోసం, అన్నపానియాలు ... వాటిని స్వీకరించే ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపడం కోసం. అలాంటి వాతావరణానికి భంగం కలిగించే సెల్ ఫోన్లను గుడికి తీసుకురాకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకువచ్చినా ఆ కాసేపు దానిని ఉపయోగించకుండా వుంటే సరిపోతుంది.

ఎవరో చెప్పారని ... ఆదేశించారని కాకుండా గుడిలోకి సెల్ ఫోన్ తో వెళ్లకూడదనే ఒక నియమాన్ని ఎవరికి వారుగా పాటించాలి. అప్పుడే ఆ భగవంతుడి సౌందర్యాన్ని చూసి అనుభూతి చెంద గలుగుతారు ... ఆయన ప్రసాదాల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు .. ఆయన లీలా విశేషాలను తలచుకుని పరవశించిపోతారు.


More Bhakti News